Headlines

శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీల లెక్కింపు.. 29 రోజుల్లో భారీగా ఆదాయం


శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ స్వామి, అమ్మవార్ల ఉభయ ఆలయాలకు సంబంధించిన హుండీలను లెక్కించగా.. మొత్తం రూ.4 కోట్ల 56 లక్షల 49 వేల 63 రూపాయల ఆదాయం సమకూరింది. గత 29 రోజులుగా భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. హుండీల ద్వారా నగదుతో పాటు బంగారం, వెండి కూడా లభించాయి. మొత్తం 79 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం, 3 కేజీల 760 గ్రాముల వెండిని భక్తులు కానుకగా సమర్పించారు. విదేశీ కరెన్సీలోనూ భక్తులు కానుకలు సమర్పించారు. ఇందులో 823 అమెరికా డాలర్లు, 515 యూఏఈ దిర్హమ్స్, 93 సింగపూర్ డాలర్లు, 50 ఆస్ట్రేలియా డాలర్లు, 45 కెనడా డాలర్లు, 10 ఇంగ్లాండ్ పౌండ్లు, 20 సౌదీ రియాల్స్, 5 కువైట్ దినార్లు, 5 ఒమాన్ రియాల్స్ ఉన్నాయి. పటిష్టమైన నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ మధ్య హుండీల లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

నందీశ్వరస్వామికి విశేషార్చన

త్రయోదశిని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో నందీశ్వరస్వామికి విశేషార్చన నిర్వహించారు. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రదోషకాలంలో నందీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు, వేదపండితులు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం చేశారు. దేశంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని.. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అలాగే అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు సంభవించకుండా ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని సంకల్పించారు. అనంతరం మహాగణపతి పూజను నిర్వహించి నందీశ్వరస్వామికి విశేషార్చన కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *