భారతీయ సినీ చరిత్రలో బీ. సరోజా దేవి పేరు అగ్రతారలలో ఒకటిగా నిలిచిపోతుంది. దశాబ్దాల పాటు వివిధ భాషల్లో సుమారు 180 చిత్రాల్లో నటించిన ఆమె, అందులో 160 సినిమాల్లో ఎలాంటి సహాయ పాత్రలు చేయకుండా ప్రధాన కథానాయికగా కొనసాగడం ఒక అద్భుత రికార్డు. ఈ ఘనత అప్పటి తరం నటీమణులలో చాలా అరుదు. 1938లో జన్మించిన సరోజా దేవి గత సంవత్సరం 87వ ఏట బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె తండ్రి వీరప్ప పోలీస్ ఉద్యోగి అయినప్పటికీ, నాటకాలపై ఆసక్తి ఉండటంతో, చిన్నప్పటి నుంచే ఆమెను నటన వైపు ప్రోత్సహించారు. 13-14 ఏళ్ల వయసులో హొన్నప్ప భాగవతార్ దృష్టిలో పడి, కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో వెండితెర ప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం సాగింది. మద్రాసు (చెన్నై)కు మకాం మార్చిన తర్వాత, తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా ఎదిగారు. హిందీలో దిలీప్ కుమార్‌తో, తెలుగులో ఎన్.టి. రామారావుతో, తమిళంలో ఎం.జి. రామచంద్రన్‌తో కలిసి నటించి, మూడు భాషల్లోనూ ఒకే సమయంలో విజయాలు అందుకున్న ఏకైక నటిగా ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
తెలుగులో ఆమె తొలి చిత్రం పెళ్లి సందడి అయినా, పాండురంగ మహత్యం ముందుగా విడుదలైంది. ఎన్.టి. రామారావు నిర్మాణంలో, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి భూకైలాస్ (ద్విభాషా చిత్రం), జగదేక వీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, భాగ్య చక్రం, ఉమా చండి గౌరీ శంకర కధ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. జగదేక వీరుని కథ చిత్రం ఒక మలుపు. ఎం.జి. రామచంద్రన్‌తో కలిసి 25 చిత్రాల్లో నటించి, తమిళనాట కూడా అగ్ర తారగా వెలుగొందారు. ఎం.జి.ఆర్ తన పక్కన నచ్చిన నాయికలతో 25 సినిమాలకు ఒప్పందం చేసుకునే సంప్రదాయాన్ని కలిగి ఉండేవారు. సరోజా దేవితో పాటు జయలలిత, మంజుల, లత వంటి నాయికలు కూడా ఎం.జి.ఆర్ సరసన అనేక చిత్రాల్లో నటించారు.
బీ. సరోజా దేవి ప్రత్యేకత ఆమె అభినయమే కాదు, ఆమె అద్భుతమైన నాట్య కౌశలం. సావిత్రి, జమున వంటి నటీమణులతో పోలిస్తే, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాల్లో ఆమె ప్రావీణ్యం ఆమెకు అదనపు బలాన్ని చేకూర్చింది. అంతేకాదు, ఆమె తన చిత్రాల్లో అన్ని భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. ఆమె మధురమైన కంఠం, స్పష్టమైన ఉచ్చారణ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. కెరీర్ చివరి దశలో ప్రధాన కథానాయిక పాత్రల నుంచి తల్లి, అక్క వంటి సహాయ పాత్రలకు మారినా, అల్లుడు దిద్దిన కాపురం, సూర్య నటించిన గట్టికొడుకు వంటి చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కర్ణాటక చిత్ర పరిశ్రమ ఆమెను ఎంతో గౌరవించింది. బీ. సరోజా దేవి కేవలం ఒక నటిగానే కాకుండా, కళకు అంకితమైన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంగా భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి