దక్షిణ భారతదేశంలో ఉదయాన్నే టిఫిన్ అనగానే టక్కున గుర్తొచ్చే వంటకాల్లో ఉప్మా ఒకటి. చాలా ఇళ్లలో సులభంగా, త్వరగా తయారయ్యే అల్పాహారం ఇదే. అయితే మనం ఉప్మా చేయడానికి వాడే రవ్వను తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బొంబాయి రవ్వ అని పిలుస్తుంటారు. అసలు గోధుమల నుంచి తయారయ్యే ఈ రవ్వకు మహారాష్ట్ర రాజధాని ముంబై పేరు ఎలా వచ్చింది..? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దీన్ని వెనక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మన దేశంలో బ్రిటిష్ పాలన ఉన్న సమయంలో బొంబాయి అతిపెద్ద వాణిజ్య, ఓడరేవు నగరంగా ఉండేది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆహార పదార్థాలు, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రవాణా అయ్యే సరుకులు ముందుగా బొంబాయి పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచే దక్షిణ భారతానికి పంపిణీ అయ్యేవి. ఆ కాలంలో గోధుమ రవ్వను భారీ స్థాయిలో ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి పంపే ప్రధాన కేంద్రంగా బొంబాయి ఉండేది. అలా బొంబాయి నుంచి దిగుమతి అయ్యే రవ్వ కావడంతో స్థానికులు దీనిని బొంబాయి రవ్వ అని పిలవడం మొదలుపెట్టారు.
మిల్లింగ్ టెక్నాలజీ పరిచయం
దక్షిణ భారతదేశంలో సంప్రదాయకంగా వరి పంట ఎక్కువగా పండేది. గోధుమల వినియోగం, వాటిని రవ్వగా మార్చే ఆధునిక రోలర్ ఫ్లోర్ మిల్లులు మొదటగా బొంబాయి, ఉత్తర భారత ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి. ముఖ్యంగా కఠినమైన డురమ్ గోధుమల నుంచి నాణ్యమైన, ముతక రవ్వను వేరు చేసే యంత్రాలు బొంబాయిలో విస్తృతంగా ఉండేవి. అక్కడి మిల్లుల్లో తయారైన రవ్వ నాణ్యత బాగుండటంతో దక్షిణాది వ్యాపారులు బొంబాయి నుంచే దీనిని తెప్పించుకునేవారు.
బ్రాండింగ్‌గా మారిన ప్రాంతం పేరు
వ్యాపార పరిభాషలో ఒక ప్రాంతం నుంచి వచ్చే నాణ్యమైన వస్తువుకు ఆ ఊరి పేరే బ్రాండ్‌గా మారిపోతుంటుంది. అదే తరహాలో బొంబాయి నుంచి వచ్చిన రవ్వ అని దుకాణదారులు చెప్పడం అలవాటై, కాలక్రమేణా అదే దాని అసలు పేరుగా స్థిరపడిపోయింది.
వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లు
- ఇదే రవ్వను దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
- ఉత్తర భారతదేశం: దీనిని ఎక్కువగా సూజీ అంటారు.
- తమిళనాడు, కేరళ: అక్కడ దీనిని రవై అని పిలుస్తారు.
ఇలా కేవలం రవాణా, వాణిజ్య కేంద్రం కారణంగా అంటుకున్న బొంబాయి అనే పేరు, నేటికీ మన వంటింట్లో ఉప్మా రవ్వకు శాశ్వత చిరునామాగా నిలిచిపోయింది.