
Virat Kohli record vs Mumbai Indians: ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌పై టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కేఎల్ రాహుల్ (977 పరుగులు) పేరిట ఉండగా, తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లీ అతడిని అధిగమించాడు. శిఖర్ ధావన్ 901 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
37 ఏళ్ల వయసులోనూ అదే జోరు..
వయసు పెరుగుతున్నా కోహ్లీలోని పట్టుదల, పరుగుల దాహం ఏమాత్రం తగ్గలేదని ఈ మ్యాచ్ నిరూపించింది. రోహిత్ శర్మ సొంత గడ్డపై, ముంబై అభిమానుల ముందే కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం ముంబైపైనే కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నైపై ఆయన ఏకంగా 1,174 పరుగులు సాధించాడు. ఇది ఒక ఐపీఎల్ జట్టుపై ఒకే ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు.
వాంఖడేలో పరుగుల సునామీ..
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ, తన భాగస్వామి ఫిలిప్ సాల్ట్‌తో కలిసి ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. వీరిద్దరి ధాటికి బెంగళూరు జట్టు కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఇది ముంబైపై బెంగళూరుకు మూడో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ. పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
బద్దలైన రికార్డులు.. భారీ భాగస్వామ్యం..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ కలిసి మొదటి వికెట్‌కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు తరపున ఇది రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. ఫిలిప్ సాల్ట్ 35 బంతుల్లో 6 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, కోహ్లీ 25 బంతుల్లో 35 పరుగులు చేసి తన వంతు సహకారాన్ని అందించాడు. శార్దూల్ ఠాకూర్ ఈ జోడీని విడదీసినప్పటికీ, అప్పటికే బెంగళూరు భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది.
ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. రన్ మెషిన్ కోహ్లీ తన బ్యాట్‌తో సమాధానం చెబుతూ, విమర్శకుల నోళ్లు మూయించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..