తెలంగాణ ప్రభుత్వంతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు యథావిధిగా తిరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చర్చల్లో తెలిపినట్లు చెబుతున్నారు. దీంతో జేఏసీ నేతలు సమ్మె విరమించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సమ్మె విరమణపై కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. అధికారిక ప్రకటన వస్తే కానీ ఫుల్ క్లారిటీ అనేది రాదు. గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. దీంతో బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు అందుబాటులో లేక బస్టాండ్లలోనే గంటల కొద్ది వేచి చూస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నం
ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ శుక్రవారం మరణించారు. కార్మికులు తొందరపాటు చర్యకు పాల్పడవద్దని ప్రభుత్వం చెబుతన్నా కార్మికులు వినిపించుకోవడం లేదు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్లో తిప్పుతోంది. ఇక ఇతర జిల్లాల్లో అద్దె బస్సులతో పాటు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడుపుతోంది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం..!
శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వంతో ఆర్టీసీ విలీనం, వేత సవరణపై సానుకూల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచే బస్సులను తిప్పుతామని ఆర్టీసీ జేఏసీ తెలిపినట్లు తెలుస్తోంది.