Zero Shadow: మీ నీడ మీకు కనిపించదు.. హైదరాబాద్‌లో అరుదైన ఖగోళ వింత.. ఎప్పుడంటే..?

Zero Shadow: మీ నీడ మీకు కనిపించదు.. హైదరాబాద్‌లో అరుదైన ఖగోళ వింత.. ఎప్పుడంటే..?


హైదరాబాద్ వాసులకు ఈ శనివారం ఓ ప్రత్యేక అనుభూతి ఎదురుకానుంది. సాధారణంగా ఎండలో బయట నిలబడితే మన నీడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మే 9న మాత్రం కేవలం రెండు నిమిషాల పాటు మీ నీడ పూర్తిగా కనిపించకుండా పోనుంది. ఈ అరుదైన ఖగోళ ఘటనను జీరో షాడో డేగా పిలుస్తారు. శనివారం మధ్యాహ్నం కచ్చితంగా 12:12 గంటలకు సూర్యుడు హైదరాబాద్ నగరంపై నేరుగా 90 డిగ్రీల కోణంలో నిలుస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నిలువుగా పడటంతో నిలువుగా ఉన్న వస్తువులకు నీడ దాదాపు కనిపించదు. మనిషి, కర్ర, బాటిల్, స్తంభం.. ఏ వస్తువైనా నీడ లేకుండా కనిపించడం ఈ ఘటన ప్రత్యేకత.

అసలు జీరో షాడో డే అంటే ఏమిటి..?

భూమి తన అక్షంపై 23.5 డిగ్రీల వంపుతో తిరుగుతూ ఉండటంతో సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుడు కొన్ని ప్రాంతాలపై నేరుగా నిలుస్తాడు. అప్పుడు సూర్యకిరణాలు పూర్తిగా నిలువుగా పడటంతో నీడలు మాయం అవుతాయి. కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లో ఈ ఘటన సంవత్సరానికి రెండుసార్లు కనిపిస్తుంది.

బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం

ఈ అరుదైన ఘటనను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించేందుకు హైదరాబాద్‌లోని B M Birla Science Centreలో ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు జీరో షాడో డే వెనుక ఉన్న సైన్స్‌ను వివరిస్తారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు, సూర్య పరిశీలన, చిన్న చిన్న ప్రయోగాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు తమతో పాటు స్కేల్, బాటిల్ లేదా చిన్న నిలువు వస్తువులు తీసుకెళ్లి స్వయంగా ఈ అద్భుతాన్ని పరిశీలించవచ్చు.

ఇతర నగరాల్లో ఎప్పుడు..?

ఇప్పటికే బెంగళూరులో ఏప్రిల్ 24న ఈ ఘటన నమోదైంది. హైదరాబాద్ తర్వాత మే 13న పుణే, మే 15న ముంబై నగరాల్లో జీరో షాడో డే కనిపించనుంది. జూన్‌లో భోపాల్‌లో కూడా ఈ అరుదైన దృశ్యం కనిపించనుంది.

ఎందుకింత ప్రత్యేకం..?

ప్రతిరోజూ మనతో పాటు కనిపించే నీడ ఒక్కసారిగా మాయం కావడం సాధారణ విషయం కాదు. ప్రకృతి, ఖగోళ శాస్త్రం కలిసి చూపించే అద్భుత దృశ్యమిది. కేవలం రెండు నిమిషాలైనా.. ఆ క్షణంలో హైదరాబాద్ మొత్తం సూర్యుడి కింద నేరుగా నిలిచినట్టే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *