VATను 18 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ప్రయోజనం

VATను 18 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ప్రయోజనం


పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై విధించే విలువ ఆధారిత పన్ను (VAT)ను 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 14 వరకు అమల్లో ఉండనుంది. ఇంధన వ్యయం విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 35-40 శాతం వరకు ఉండటంతో, ఈ పన్ను కోత సంస్థలకు గణనీయమైన ఉపశమనంగా మారనుంది.

ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఇంధనం నింపే ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. దేశంలో ఢిల్లీ తర్వాత అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఉన్న ముంబై ఎయిర్‌పోర్ట్‌ దేశీయ విమాన రాకపోకల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే పూణె, నాగ్‌పూర్‌ నగరాల విమాన సేవలకు కూడా ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది. ఇటీవలి నెలల్లో ప్రపంచ జెట్ ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి చివర్లో బ్యారెల్‌కు 99.40 డాలర్లుగా ఉన్న ధర, మే మొదటి వారానికి 162.89 డాలర్లకు చేరింది. ముడి చమురు ధరలు పెరగడంతో శాతంగా విధించే వ్యాట్ కూడా పెరగడం వల్ల విమానయాన సంస్థలపై అదనపు భారం పడుతోంది.

ఇక ఎయిర్‌ ఇండియా ఇప్పటికే పెరుగుతున్న ఇంధన వ్యయాల కారణంగా కొన్ని అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని కోతలు ఉండొచ్చని కూడా హెచ్చరించింది. విమానయాన రంగం చాలా కాలంగా ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. తాజా పన్ను తగ్గింపు నిర్ణయం తాత్కాలిక ఉపశమనాన్ని అందించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారంగా జీఎస్టీ అమలే సరైన మార్గమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *