Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…


Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాష్ట్రంలోని 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 155 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశముందని హెచ్చరించారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాయలసీమ జిల్లాల్లో కూడా 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇక ఎండల మధ్య మరోవైపు పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడవద్దని సూచించారు.

బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.8 డిగ్రీలు, కుక్కునూరు, కూనవరం ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి. చీరాల, కొవ్వూరు, తడ వంటి ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలు దాటింది.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మంచినీరు వెంట తీసుకెళ్లాలని, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *