పుల్లగా, కారం రుచితో నోరూరించే పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ముందుగా దూరం పెట్టే ఫాస్ట్ ఫుడ్స్‌లో ఇది కూడా ఒకటి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో “పానీ పూరీ తింటే బరువు తగ్గొచ్చు” అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
పానీ పూరీలో నిజంగా తక్కువ కేలరీలు ఉంటాయా?
డైటీషియన్ల ప్రకారం, సాధారణంగా పానీ పూరీలో కేలరీలు తక్కువగానే ఉంటాయి. కానీ దాన్ని ఎలా తయారుచేస్తున్నారు? ఏ పదార్థాలు వాడుతున్నారు? అనే దానిపై ఆరోగ్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో దొరికే చాలా పానీ పూరీల్లో బంగాళాదుంప, శనగలు, తీపి చట్నీ, వేయించిన పూరీలు వాడుతుంటారు. ఇవి అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెర కారణంగా బరువు పెరగడానికి దారితీసే అవకాశం ఉంటుంది.
ఇలా తింటే బరువు నియంత్రణకు సహాయం
నిపుణుల సూచనల ప్రకారం కొన్ని మార్పులు చేస్తే పానీ పూరీ ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారొచ్చు.
ఇవి కూడా చదవండి
- బంగాళాదుంపకు బదులుగా పెసరపప్పు లేదా మినపపప్పు వాడాలి
- మైదా పూరీలకు బదులుగా గోధుమ లేదా రవ్వతో చేసిన పూరీలు మంచివి
- తీపి చట్నీ తగ్గించాలి
- వేయించిన బూందీ వంటివి దూరంగా ఉంచాలి
పప్పుల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్ ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తాయి. దీంతో ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది.
పానీ కూడా ఆరోగ్యానికి మంచిదే!
పానీ పూరీ నీటిలో వేసే జీలకర్ర, పుదీనా, ఇంగువ, నల్ల ఉప్పు వంటి పదార్థాలు జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మెటాబాలిజాన్ని కూడా వేగవంతం చేసే అవకాశం ఉంది.
అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- రోడ్డు పక్కన అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తినకండి
- రాత్రి ఆలస్యంగా పానీ పూరీ తినడం మంచిది కాదు
- ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోకూడదు
- ఇంట్లో తయారు చేసిన పానీ పూరీ అయితే మరింత సురక్షితం
పానీ పూరీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ సరైన పదార్థాలతో, పరిమిత మోతాదులో తీసుకుంటే అది బరువు నియంత్రణలో భాగమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.