Headlines

Watch Video: జాగ్రత్త.. పైనుంచి డ్రోన్ చూస్తోంది! చెరువు వద్ద ఓపెన్‌గా మందేస్తూ దొరికిపోయిన మందుబాబుల!

Watch Video: జాగ్రత్త.. పైనుంచి డ్రోన్ చూస్తోంది! చెరువు వద్ద ఓపెన్‌గా మందేస్తూ దొరికిపోయిన మందుబాబుల!


హైదరాబాద్ మహానగరంలో ప్రజా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ నిఘా సమయంలో ఒక బహిరంగ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిస్సిగ్గుగా మద్యం సేవిస్తుండగా డ్రోన్ కెమెరాలు వారిని స్పష్టంగా గుర్తించాయి.

డ్రోన్ కెమెరా రికార్డ్ చేసిన ఈ లైవ్ దృశ్యాలు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరాయి. ఈ దృశ్యాల ఆధారంగా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్థానిక సరూర్‌నగర్ పోలీస్ బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బహిరంగంగా మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం కావడంతో, పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు నిబంధనల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, మహిళలు మరియు కాలనీవాసుల భద్రతకు ఇటువంటి డ్రోన్ నిఘా ఎంతో తోడ్పడుతుందని, భవిష్యత్తులోనూ దీనిని మరింత ముమ్మరం చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సుమతి హెచ్చరించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *