Headlines

Telangana: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కారులో వచ్చి కత్తులతో దారుణంగా..


నిజామాబాద్ నగరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. గతంలో గర్భిణిగా ఉన్న తన భార్య, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని కట్నం కోసం హతమార్చిన కేసులో నిందితుడైన హరిబాబును గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. కారులో వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హరిబాబు రోడ్డుపై వెళ్తుండగా, ఒక్కసారిగా కారులో దూసుకొచ్చిన దుండగులు అతడిని అడ్డగించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, దుండగులు అతడిని వెంటాడి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పట్టపగలు, జనాలు చూస్తుండగానే ఈ దాడి జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడు

గతంలో యూట్యూబర్ వైష్ణవి మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదనపు కట్నం కోసం గర్భిణి అని కూడా చూడకుండా భార్య వైష్ణవిని హరిబాబు హత్య చేసినట్లు తీవ్ర ఆరోపణలు, కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన హరిబాబు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఎవరు చంపారు..? ప్రతీకారంతో వైష్ణవి తరఫు బంధువులే ఈ దాడికి ఒడిగట్టారా? అన్న కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల గాలింపు

సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులు వచ్చిన కారు నంబర్ మరియు ప్రయాణించిన మార్గాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పాత కక్షలు, ప్రతీకార హత్యేనా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *