మధ్యప్రాచ్యంలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న అలజడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక పొదుపు చర్యలను ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన వ్యయం, దిగుమతి ఖర్చులు, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు ఈ కొత్త ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది. గురువారం (సెప్టెంబర్ 17) జారీ చేసిన కేబినెట్ డివిజన్ నోటిఫికేషన్ ప్రకారం.. కొన్ని ఆంక్షలు తక్షణమే అమల్లోకి రాగా, మరికొన్ని మూడు నెలల పాటు కొనసాగనున్నాయి.
కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది. మన్నికైన వస్తువుల కొనుగోళ్లపైనా ఆంక్షలు విధించినప్పటికీ, ఐటీ సంబంధిత కొనుగోళ్లు, అభివృద్ధి ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో అధికారిక వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని మూడు నెలల పాటు 50 శాతం తగ్గించింది. అయితే సాయుధ దళాలు, పౌర సాయుధ దళాలు, శాంతిభద్రతల సంస్థలు, అత్యవసర సేవలు, ఎఫ్బీఆర్కు చెందిన కార్యాచరణ వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.
ప్రభుత్వ శాఖల ఉద్యోగేతర వ్యయాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా 5 శాతం కోత విధించారు. విదేశాల్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలు, అక్కడ పనిచేసే అధికారులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే అద్దె, విద్యా రుసుములు, వైద్య ఖర్చులకు మినహాయింపు ఉంటుంది. అలాగే, విదేశీ పర్యటనలపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించారు. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండగా, మంత్రులు, సలహాదారులు, ఎంపీలు, అధికారులు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. స్కాలర్షిప్లు, అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాముల శిక్షణ కార్యక్రమాలకు మినహాయింపులు ఉన్నాయి.
ప్రజలను నేరుగా ప్రభావితం చేసే నిర్ణయాల్లో భాగంగా వివాహ వేడుకల్లో ఒకే రకమైన వంటకాన్ని మాత్రమే వడ్డించాలని ఆదేశించారు. దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకు, వివాహ వేదికలు 10 గంటలకు, రెస్టారెంట్లు 11 గంటలకు మూసివేయాలి. ఫార్మసీలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఇంధన-సీఎన్జీ స్టేషన్లు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లకు మినహాయింపు ఇచ్చారు.
మధ్యప్రాచ్య పరిణామాల కారణంగా ఇంధన ధరలు, దిగుమతి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం గత మార్చిలోనూ ఇలాంటి పొదుపు చర్యలు చేపట్టింది. తాజా ప్యాకేజీతో ప్రభుత్వ ఖర్చుల నుంచి వ్యాపార సమయాలు, విదేశీ ప్రయాణాలు, వివాహ వేడుకల వరకు పొదుపు చర్యలను విస్తరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..