క్యాన్సర్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో మొదట మెదిలే ఆలోచన సర్జరీ లేదా ఆపరేషన్. క్యాన్సర్ చికిత్సకు సర్జరీ అత్యంత కీలకమైన భాగమే అయినప్పటికీ, అన్ని రకాల క్యాన్సర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా, నేడు రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చాలా మంది రోగులకు ఎలాంటి కోతలు లేకుండానే చికిత్స పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
రేడియేషన్ థెరపీ ఎలా పనిచేస్తుంది?
రేడియేషన్ థెరపీలో హై-ఎనర్జీ కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయడం లేదా వాటి వృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లకు ఇదే ప్రధాన చికిత్సగా ఉపయోగపడుతుంది. మరికొన్ని సందర్భాల్లో కీమోథెరపీ లేదా సర్జరీతో కలిపి దీనిని అందిస్తారు. నేడు అందుబాటులో ఉన్న IMRT, IGRT వంటి ఆధునిక సాంకేతికతలతో ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనివల్ల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలకు తక్కువ నష్టం వాటిల్లుతుంది.
ఆన్లైన్ అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకత:
రోగి రోజువారీ శారీరక స్థితికి అనుగుణంగా చికిత్స ప్రణాళికను మార్చుకునే వెసులుబాటును ఈ టెక్నాలజీ అందిస్తుంది. చికిత్స సమయంలో ట్యూమర్ పరిమాణంలో మార్పులు జరిగితే, ప్రతి సెషన్‌కు ముందు తీసే ఇమేజింగ్ స్కానింగ్ ఆధారంగా వైద్యులు రేడియేషన్ ప్లాన్‌లో తక్షణ మార్పులు చేస్తారు. ఇది సున్నితమైన అవయవాలను రక్షించడానికి ఎంతో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
రేడియోసర్జరీ అంటే ఏమిటి?
పేరులో సర్జరీ ఉన్నప్పటికీ, ఇందులో ఎలాంటి కోతలు లేదా చీల్చడం ఉండదు. ఇది ఒక ప్రత్యేకమైన రేడియేషన్ టెక్నిక్. దీనిలో భాగంగా హై-డోస్ రేడియేషన్‌ను నేరుగా ట్యూమర్‌పై ప్రయోగిస్తారు. మెదడులోని కొన్ని రకాల ట్యూమర్ల కోసం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఉపయోగిస్తే, ఊపిరితిత్తులు, కాలేయం వంటి భాగాలకు స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ వాడతారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ సెషన్లలోనే చికిత్స పూర్తవుతుంది. అయితే, ప్రతి రోగికి, అన్ని రకాల క్యాన్సర్లకు ఈ పద్ధతులు సరిపోవు. ట్యూమర్ పరిమాణం, అది ఉన్న స్థానం, రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులైన ఆంకాలజిస్ట్ సరైన చికిత్సను నిర్ణయిస్తారు. చికిత్స సమయంలో వచ్చే దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు వైద్యుల పర్యవేక్షణ అత్యంత ముఖ్యం.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..