Headlines

శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి..? చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునే సింపుల్ చిట్కాలు..


గత కొన్నేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. మారిన జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా పిన్న వయస్కుల్లోనూ గుండె సమస్యలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని చేరవేసే మార్గాలను మూసివేయడమే ఈ ఆకస్మిక కార్డియాక్ అరెస్టులకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అందుకే గుండె జబ్బులను ముందస్తుగానే గుర్తించి నివారించడానికి ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్, నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్‌స్టిట్యూట్ వంటి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

వైద్యులు ఏమంటున్నారు?

ఈ అంశంపై ఢిల్లీలోని మూల్‌చంద్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ తరుణ్ కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. ‘‘శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. ప్రస్తుతం యువతలో కూడా గుండె జబ్బుల రేటు మునుపటి కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. నివారణే ఉత్తమమైన మార్గం కాబట్టి, 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ శరీరంలోని కొవ్వు శాతాన్ని తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి” అని ఆయన సూచించారు. అవసరాన్ని బట్టి ఈసీజీ, బ్లడ్ షుగర్ వంటి ఇతర ప్రాథమిక పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిదని తెలిపారు.

కొలెస్ట్రాల్ పరీక్ష ఎవరికి అత్యవసరం?

లక్షణాలు కనిపించకపోయినా, కింది జాబితాలో ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలి.

అధిక బరువు: పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారు.

మధుమేహం (షుగర్): రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే రోగులు.

బీపీ – కిడ్నీ సమస్యలు: హైబీపీ, దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు.

కుటుంబ చరిత్ర: రక్తసంబంధీకులలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండెపోటు లేదా గుండె సమస్యలు వచ్చిన హిస్టరీ ఉన్నవారు.

ధూమపానం, మద్యం సేవించే అలవాటు: సిగరెట్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారి రక్తనాళాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

నిశ్చల జీవనశైలి: గంటల తరబడి కూర్చుని పనిచేసే వారు, అధిక ఒత్తిడికి గురయ్యేవారు.

శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి?

రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు రిపోర్టులో ఈ స్థాయిలను గమనించాలి:

మొత్తం కొలెస్ట్రాల్: 200 mg/dL కంటే తక్కువగా ఉండాలి. 200–239 mg/dL ఉంటే బోర్డర్‌లైన్‌గా, 240 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే హై-రిస్క్‌గా పరిగణిస్తారు.

చెడు కొలెస్ట్రాల్ : ఇది 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి. రక్తనాళాల్లో పూడికలకు కారణమయ్యేది ఇదే.

మంచి కొలెస్ట్రాల్ : ఇది గుండెకు రక్షణ ఇస్తుంది కాబట్టి 40 mg/dL కంటే ఎక్కువగా (స్త్రీలలో 50 mg/dL పైగా) ఉండాలి.

ట్రైగ్లిజరైడ్స్ : ఇవి 150 mg/dL కంటే తక్కువగా ఉండటం మంచిది.

కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి?

రోజూ వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా ఏదైనా ఏరోబిక్ వ్యాయామం చేయాలి.

డీప్ ఫ్రైడ్‌కు దూరం: అధికంగా నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా మసాలాలు ఉన్న ఆహారాలను పూర్తిగా తగ్గించాలి.

ఫాస్ట్ ఫుడ్ నియంత్రణ: ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్డ్ స్నాక్స్, బేకరీ వస్తువుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతుంది.

ఆహారంలో మార్పులు: ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఓట్స్, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు: వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి, అవసరమైన మోతాదులో ఆరోగ్యకరమైన నట్స్ తీసుకోవాలి.

సైలెంట్ కిల్లర్‌గా మారిన అధిక కొలెస్ట్రాల్‌ను సకాలంలో గుర్తించి తగిన జీవనశైలి మార్పులు చేసుకుంటే, ఆకస్మిక గుండెపోటు ముప్పు నుంచి గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *