దళపతి విజయ్ ఆస్తులు ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

దళపతి విజయ్ ఆస్తులు ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..


దళపతి విజయ్ ఆస్తులు ఎంతో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలుస్తున్న తమిళ వెట్రి కళగం అధినేత, సూపర్ స్టార్ విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. సోమవారం పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 603.20 కోట్లుగా పేర్కొన్నారు.

ఆస్తుల చిట్టా ఇదీ..

చరాస్తులు: రూ. 404.58 కోట్లు (ఇందులో రూ. 213 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి).

స్థిరాస్తులు: రూ.198.62 కోట్లు (కోడైకనాల్‌లో వ్యవసాయ భూమి, చెన్నైలో నివాస, వాణిజ్య సముదాయాలు).

భార్య సంగీత ఆస్తులు: రూ. 15.76 కోట్లు.

వార్షిక ఆదాయం: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.184.53 కోట్ల ఆదాయాన్ని చూపించారు.

లగ్జరీ కార్లు – నగదు నిల్వలు

సినీ రంగంలో అగ్ర హీరోగా ఉన్న విజయ్ వద్ద అత్యాధునిక వాహనాలు ఉన్నాయి. ఆయన గ్యారేజీలో BMW 530, టయోటా లెక్సస్, టయోటా వెల్‌ఫైర్, BMW i7 వంటి కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. ఇక చేతిలో రూ.2 లక్షల నగదు ఉండగా, 883 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.

అప్పులు లేవు.. కానీ అప్పులు ఇచ్చారు

విజయ్ తన అఫిడవిట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు. తనకు బ్యాంకులకు కానీ, ఇతర ఆర్థిక సంస్థలకు కానీ ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేశారు. అయితే ఆయన తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు భారీగా రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ.3.02 కోట్లు, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్‌కు రూ.3 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, ట్రస్టులకు సుమారు రూ.45 కోట్లకు పైగా అడ్వాన్సులు ఇచ్చారు.

వివాదాలు – విద్యార్హతలు

2015-16 సంవత్సరానికి సంబంధించి రూ.1.50 కోట్ల ఆదాయపు పన్ను వివాదం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు విజయ్ తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఎక్కడా దోషిగా నిర్ధారించబడలేదని వెల్లడించారు. 1992లో చెన్నైలోని లయోలా కళాశాలలో బీఎస్సీ డిగ్రీని మధ్యలోనే ఆపేసినట్లు తెలిపారు.

ఎన్నికల సమరం

తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ తన రాజకీయ అరంగేట్రంలో భాగంగా పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్నారు. మే 4న వెలువడనున్న ఫలితాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *