
ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం పది దాటితేనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఉక్కపోత సమయంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అయితే చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. వేడిని తట్టుకోవడానికి ఒకవైపు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూనే, మరోవైపు మసాలాలు దట్టించిన చికెన్, మటన్ వంటి మాంసాహారాలను లాగించేస్తుంటారు. కానీ వేసవిలో మాంసాహారం అతిగా తినడం వల్ల మీరు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసంలో ఉండే అధిక ప్రోటీన్లు మన శరీర జీవక్రియపై అదనపు భారాన్ని పెంచుతాయి. దీనివల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి, గుండెపోటు నుండి జీర్ణకోశ వ్యాధుల వరకు అనేక ముప్పులు పొంచి ఉన్నాయి.
ఎండల్లో మాంసాహారం ఎందుకు వద్దు?:
శరీరంలో ఉష్ణోత్పత్తి
మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవిలో ఇప్పటికే బయట వేడి ఎక్కువగా ఉండటం వల్ల మాంసం తింటే శరీరం మరింత వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది.
డీహైడ్రేషన్
మాంసంలోని అధిక ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీనివల్ల శరీరంలోని నీటి నిల్వలు త్వరగా ఖర్చయిపోయి, మీరు నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఉంది.
మందగించే జీర్ణక్రియ
వేసవిలో మన శరీర జీవక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది. ఇటువంటి సమయంలో భారీ మాంసాహార భోజనాన్ని జీర్ణం చేసుకోవడం కడుపుకు పెద్ద భారమవుతుంది. ఫలితంగా ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
త్వరగా పాడయ్యే ప్రమాదం
అధిక ఉష్ణోగ్రతల వల్ల మాంసం చాలా త్వరగా బ్యాక్టీరియా బారిన పడి పాడవుతుంది. సరిగ్గా నిల్వ చేయని లేదా సరిగ్గా ఉడకని మాంసం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు వంటి ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
గుండె – క్యాన్సర్ ముప్పు
ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది ధమనుల్లో పేరుకుపోయి రక్తపోటును పెంచుతుంది. అలాగే, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వేసవి నెలల్లో మాంసాహారాన్ని వీలైనంత మితంగా తీసుకోవడం ఉత్తమం. దానికి బదులుగా ఈ కాలంలో లభించే తాజా పండ్లు, కూరగాయలు, మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం తేమగా తేలికగా ఉంటుంది.