పురాతన కోటలో అరుదైన శిల్పం.. చరిత్ర తెలిస్తే దెబ్బకు నివ్వెరపోవాల్సిందే..!

పురాతన కోటలో అరుదైన శిల్పం.. చరిత్ర తెలిస్తే దెబ్బకు నివ్వెరపోవాల్సిందే..!


పురాతన కోటలో అరుదైన శిల్పం.. చరిత్ర తెలిస్తే దెబ్బకు నివ్వెరపోవాల్సిందే..!

పురాతన నాగరికత, చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, చారిత్రక శిల్ప సంపదకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాజా పరిశోధనల్లో ఆసక్తి రేపుతున్న ఓ శిల్పం వెలుగు చూసింది. ఆ ఎక్కడిదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్లగొండ జిల్లా దేవరకొండ అనగానే చారిత్రక ఖిల్లా గుర్తుకు వస్తుంది. 14వ శతాబ్దంలో రేచెర్ల వెలమ రాజులు ఏడు కొండల కోటగా నిర్మించారు. రాజ్యాలు అంతరించినా, రాజులు గతించినా.. నాటి రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్నది దేవరకొండ ఖిలా. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో చరిత్రకారులు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఖిల్లాలో అనేక చారిత్రక విశేషాలు వెలుగు చూస్తున్నాయి.

తాజాగా అరుదైన తంత్ర భైరవుడి శిల్పం బయట పడింది. దేవరకొండ కోట పాతబావికి సమీపాన పెద్దరాతిబండకు ఆరడుగుల ఎత్తు ఉన్న భైరవుని అర్ధశిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్రకారుల బృందం సభ్యుడు యూనస్ ఫర్హాన్ గుర్తించారు. ఈ భైరవుని తలమీద జ్వాలామకుటం, పైన రెండు సర్పాలు అల్లుకున్న నాగతోరణం మాదిరిగా ఉన్నాయి. ఈ శిల్పంలో భైరవుడు త్రిభంగిమలో, వైతస్తిక పాదాలతో ఎడమ వైపునకు తిరిగి నిల్చున్న చతుర్భుజుడుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఈ చతుర్భుజుడి పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాల్లో బలి ఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులున్నాయి.

భైరవునికి కుడివైపున నిలబడివున్న వ్యక్తి భైరవారాధకుడు. ఎడమవైపున ఉండవలసిన భక్తులున్న రాతిపొర రాలిపోయింది. ఎడమచేతికి దగ్గరలో మరొక మనిషి భైరవారాధనలో ఉన్నాడు. ఈలాంటి తాంత్రిక భైరవుడిశిల్పం ఇటీవలనే రాచకొండలో చరిత్రకారులు గుర్తించారు. రాచకొండ, దేవరకొండ పాలకులు భైరవోపాసకులని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. వీరి కోటల వద్ద, నిర్మాణాల వద్ద తప్పక భైరవశిల్పాలు కనిపిస్తాయని చరిత్రకారులు చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *