పోషకాల పండగ: పిస్తా పప్పులలో విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక గుప్పెడు పిస్తా పప్పుల నుండి సుమారు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పిస్తా తింటే శరీరంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడుకు, గుండెకు రక్షణ కవచం: ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో విటమిన్ బి6 అత్యధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇవి రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.
కంటి వెలుగు.. గాఢ నిద్ర: పిస్తా పప్పులలో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఇందులోని విటమిన్ బి6 నిద్రకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడి, కళ్లు ప్రకాశవంతంగా మారుతాయి.
వీరు పిస్తాకు దూరంగా ఉండాలి: పిస్తా పప్పులు అందరికీ మేలు చేయవు. నట్స్ అలర్జీ ఉన్నవారు వీటిని ముట్టకూడదు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు పిస్తాకు దూరంగా ఉండటం మంచిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి ఇవి జీర్ణం కావడం కష్టమవుతుంది. పిస్తా పప్పులు శరీరంలో వేడిని కలిగిస్తాయి. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని పరిమితంగానే తీసుకోవాలి.
రోజుకు ఎన్ని తినాలి?: ఆరోగ్యకరమైన వయోజనులు రోజుకు సుమారు దాదాపు 49 పిస్తా పప్పులు తినవచ్చు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా పెరగాలనుకుంటున్నారా అనే దానిపై ఈ సంఖ్య మారవచ్చు. అతిగా తింటే బరువు పెరగడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తప్పవు.




