సిక్‌ లీవ్‌ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ‘ఆ ఉద్యోగం నుంచి పారిపో’ అంటూ నెటిజన్ల సలహా

సిక్‌ లీవ్‌ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ‘ఆ ఉద్యోగం నుంచి పారిపో’ అంటూ నెటిజన్ల సలహా


సిక్‌ లీవ్‌ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ‘ఆ ఉద్యోగం నుంచి పారిపో’ అంటూ నెటిజన్ల సలహా

అనారోగ్యంగా ఉందని సెలవు కావాలని కోరిన ఓ కార్పొరేట్ ఉద్యోగికి తన మేనేజర్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. జ్వరం, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన సదరు ఉద్యోగి ఒక రోజు సెలవు కావాలని మేనేజర్‌ని అడిగాడు. ఈ మేరకు సిక్‌ లీవ్‌ తీసుకుంటున్నట్లు షిఫ్టకు సరిగ్గా గంట ముందు తన మేనేజర్‌ మెసేజ్‌ ఇచ్చాడు. ఇందుకు మేనేజర్‌ రిప్లై ఇస్తూ.. నాకు ఇన్‌ఫర్‌మేషన్‌ ఇస్తున్నావా? అనుమతి కోరుతున్నావా? అంటూ బదులిచ్చాడు. పైగా ఉద్యోగి అభ్యర్ధన రిక్వెస్ట్‌లా లేదని, అదొక స్టేట్‌మెంట్‌లా ఉందని అన్నాడు. వాదించే ఓపిక లేని ఉద్యోగి దానిని రిక్వెస్ట్‌గా తెలిపాడు. అయితే కథ ఇంతటితో ముగియలేదు.

కనీసం 3 రోజులపాటు ఆస్పత్రిలో చేరి డాక్టర్‌ సర్టిఫికెట్‌ చూపితేనే సిక్‌ లీవ్‌ ఇస్తానని మేనేజర్‌ మెలికపెట్టాడు. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చెబుతున్నారని ఉద్యోగి ప్రశ్నించాడు. కంపెనీ విధానం ప్రకారం కనీసం రెండు రోజుల సిక్‌ లీవ్‌తోపాటు ప్రిస్క్రీప్షన్‌ ఫాలో అవ్వడానికి, ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని వివరించాడు. కానీ మేనేజర్‌ మాత్రం ఈ రోజుకు ఎర్న్‌డ్‌ లీవ్‌ లేదా కాంప్‌-ఆఫ్‌ తీసుకుని, తర్వాత తన పరిస్థితిని తెలియజేయమని ఉద్యోగికి సలహా ఇచ్చాడు.

కానీ కొత్తగా ఉద్యోగంలో చేరడంతో ఎర్న్‌డ్‌ లీవ్‌ వినియోగించుకోవడం ఇష్టంలేని ఉద్యోగి.. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తోపాటు 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను అటాచ్‌ చేసి హెచ్‌ఆర్ పోర్టల్ ద్వారా సిక్‌ లీవ్‌కు అప్లై చేశాడు. మేనేజర్‌ సూచనలకు వ్యతిరేకంగా సదరు ఉద్యోగి సిక్‌ లీవ్‌కు అప్లై చేయడంతో గొడవ ముదిరి పాకానపడింది. హెచ్‌ఆర్ ద్వారా మెయిల్‌ పంపించడానికి నీకు ఎవరు పర్మిషన్‌ ఇచ్చారంటూ మేనేజర్ ఫోన్‌ చేసి చెడామడా తిట్టేశాడు. ముందుగా అనుమతి కోరనందుకు అతని సిక్‌ లీవ్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరించాడు. అంతేనా సిక్‌ లీవ్ కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను మేనేజర్‌తోపాటు టీమ్ లీడర్ ఇద్దరికీ పంపించాలని ఉద్యోగికి తెలిపాడు. దీంతో తనకు ఎదురైనా ఈ చేదు అనుభవాన్ని సదరు ఉద్యోగి రెడ్డిట్‌ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.

సిక్‌ లీవ్‌ గురించి ముందుగా తెలియజేయాలా లేదా అభ్యర్థించాలా? హెచ్‌ఆర్ ఆమోదం ఉన్నప్పటికీ మేనేజర్ దానిని తిరస్కరించవచ్చా? మేనేజర్లతో ప్రిస్క్రిప్షన్‌లను పంచుకోవడం సాధారణమేనా? అని అడుగుతూ సదరు ఉద్యోగి తన పోస్ట్‌లో అదిగాడు. ఈ పోస్టు కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో ఉద్యోగుల గోప్యత ప్రక్రియకు సంబంధించి మరిన్ని ప్రశ్నలను చర్చకు వచ్చాయి. నెటిజన్లు మేనేజర్‌ తీరును దుయ్యబడుతూ కామెంట్లు చేస్తున్నారు. మీ మేనేజర్ ఒక పిచ్చివాడు. ఈ విషయం మీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌లో రాసి ఉందా? ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయండి. హెచ్‌ఆర్‌కు కంప్లైంట్‌ చేయండి. అక్కడ ఇదే సంస్కృతి ఉంటే వేరే ఉద్యోగం వెతుక్కోండి. త్వరగా పారిపోండి.. అంటూ ఓ యూజర్‌ కాస్త గట్టిగానే ఏసుకున్నాడు. ఎవరూ అనారోగ్య సెలవు కోరరు. గాడిదల కంటే ఆరోగ్యాన్నే ఎంచుకోండి, ఇది వ్యక్తిగత ఉల్లంఘన. ఎందుకంటే మీ వైద్య సమాచారాన్ని చూసే అధికారం మేనేజర్లకు లేదు. అది కేవలం హెచ్‌ఆర్, కంపెనీ డాక్టర్లకు మాత్రమే ఉంటుంది. విచిత్రంగా ఉంది. సిక్‌ లీవ్‌ను ఎవరైనా ప్లాన్ చేసుకుంటారా? అసలు ఇది ఎలా సాధ్యం?.. అంటూ మేనేజర్‌ తీరును ఏకిపారేశారు.

కాగా ఈ పోస్టు పెట్టిన ఉద్యోగి భారత్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సిక్‌ లీవ్‌ కోసం కేవలం మెడికల్ సర్టిఫికెట్‌ మాత్రమే అవసరం. కానీ మన దేశంలోని పలు కంపెనీల్లోని అంతర్గత హెచ్‌ఆర్ విధానం సిక్‌ లీవ్‌ పాలసీని తమకు ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారు. అందుకే ఆయా సంస్థలను బట్టి నిబంధనలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. చాలా కంపెనీలలో సెలవు రెండు రోజులకు మించి ఉంటేనే పత్రాలు అవసరం అవుతాయి. ఉద్యోగులు ముందుగా అధికారిక అనుమతి కోరకుండా వీలైనంత త్వరగా తమ మేనేజర్‌కు తెలియజేయాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *