పెట్రోల్‌ బైకులు బ్యాన్‌..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం!

పెట్రోల్‌ బైకులు బ్యాన్‌..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం!


పెట్రోల్‌ బైకులు బ్యాన్‌..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం!

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు త్వరలో గుడ్‌బై చెప్పే పరిస్థితి ఏర్పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2026-30 ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులకు దారితీయనున్నట్లు కనిపిస్తోంది. ఈ ముసాయిదా ప్రకారం, పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా 2027 జనవరి నుంచి కొత్త పెట్రోల్ త్రీ-వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని, 2028 ఏప్రిల్ నుంచి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై పూర్తి నిషేధాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయం ఇంకా ముసాయిదా దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలదేననే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది.

ఈ పరిణామం స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వంటి కంపెనీలు ఇప్పటికే ఈవీ విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. బజాజ్ ఆటో ‘చేతక్’ మోడల్, టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్‌, ఆథర్‌ ఎనర్జీ వంటి కంపెనీలకు ఈ విధానం సువర్ణావకాశంగా మారనుంది. పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెరిగే కొద్దీ, ఈ కంపెనీల మార్కెట్ విస్తృతంగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక బ్యాటరీలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగానికి కూడా ఇది పెద్ద ఊతమివ్వనుంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ, టాటా పవర్ వంటి సంస్థలు ఈ మార్పుతో లాభపడే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఛార్జింగ్ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీ ప్రభుత్వ ఈ దూకుడు ఈవీ విధానం అమలు అయితే, అది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త పరిశ్రమ వృద్ధికి దారితీయవచ్చు. అలాగే, స్టాక్ మార్కెట్‌లో ఈవీ రంగానికి చెందిన కంపెనీలకు ఇది పెద్ద అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *