ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే


ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపాలని, నూరేళ్లు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అటువంటి జీవనశైలి కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు, విలాసవంతమైన భవనాలు అవసరం లేదు. కేవలం ప్రకృతితో మమేకమై, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతూ, నిదానంగా సాగే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే చాలని గ్రీస్‌లోని ఇకారియా ద్వీప ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని ఐదు ‘బ్లూ జోన్ల’లో ఒకటిగా నిలిచిన ఈ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకు పైగా జీవిస్తుండటం విశేషం. వారి ఆయుష్షు వెనుక ఉన్న మంత్రం మరేదో కాదు.. కేవలం ‘నిదానమే ప్రధానం’ అనే సూత్రం.

సహజసిద్ధమైన ఆహారం..

ఇకారియా ప్రజలు తీసుకునే ఆహారం పూర్తిగా ప్రకృతి ప్రసాదించిన వరంగా ఉంటుంది. ఆకుకూరలు, తృణధాన్యాలు, కూరగాయలతో పాటు ఆలివ్ ఆయిల్‌ను వారు విరివిగా ఉపయోగిస్తారు. రెడ్ మీట్ మరియు చక్కెర వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రోజ్‌మేరీ, సేజ్, పుదీనాతో తయారుచేసిన మూలికా టీలను వారు ప్రతిరోజూ సేవిస్తారు. ఇవి శరీరంలోని మలినాలను తొలగించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీరి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి పట్టుకొమ్మల్లా నిలుస్తాయి.

వ్యాయామం కోసం వీరు ప్రత్యేకంగా జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకారియా ద్వీపం కొండ ప్రాంతం కావడంతో పక్కింటికి వెళ్లాలన్నా, వీధిలోకి రావాలన్నా మెట్లు ఎక్కడం, కొండలు దిగడం తప్పనిసరి. తోట పని చేయడం, నిత్యం నడవడం వీరి అలవాటు. ఇలా సహజంగా చేసే శారీరక శ్రమ వారిని 90 ఏళ్ల వయసులో కూడా దృఢంగా ఉంచుతోంది. వయసు మళ్లిన వారు కూడా చురుగ్గా పనులు చేసుకోవడం వెనుక ఈ సహజ సిద్ధమైన వ్యాయామమే ప్రధాన కారణం.

సామాజిక అనుబంధాలు..

ఈ ద్వీపంలో ఎవరూ ఒంటరిగా కనిపించరు. సాయంత్రం వేళల్లో స్నేహితులు, బంధువులతో కలిసి చిన్నపాటి పార్టీలు చేసుకోవడం, నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం వారికి చాలా ఇష్టం. ఈ సామాజిక మద్దతు వారి మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తోంది. ఒంటరితనం వల్ల కలిగే మానసిక వ్యధలకు అక్కడ తావు లేదు. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పలకరిస్తూ, ఆప్యాయంగా పలకరించుకుంటూ గడుపుతారు. మనమూ ఇలాంటి జీవనశైలిని అలవాటు చేసుకుంటే దీర్ఘాయుష్షు పొందడం అసాధ్యమేమీ కాదు.

హడావుడి పడకుండా పనులను ఆస్వాదించడం, ప్రకృతితో సమయం గడపడం, తోటపని లేదా చిన్నపాటి నడకను అలవాటు చేసుకోవడం వంటివి మన ఆయుష్షును పెంచుతాయి. డిజిటల్ ప్రపంచానికి కాసేపు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల మనస్సు తేలికపడుతుంది. కేవలం అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే మనమూ వందేళ్ల ఆయుష్షును సొంతం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *