నిజామాబాద్, సెప్టెంబర్ 18: యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు(26) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్‌లో హరిబాబును తానే హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ పేర్కొంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని ఈ వీడియోలో అతడు తెలిపాడు. చిత్తరి హరిబాబు గురువారం మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద మక్కబుట్టలు అమ్ముకుంటున్న సమయంలో దాడికి గురయ్యాడు.
గత కొన్ని రోజులుగా తన తల్లితో కలిసి నిజామాబాద్ ఐదో ఠాణా పరిధిలోని ఇంద్రాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే మక్కబుట్టలు విక్రయిస్తున్న సమయంలో దాహం వేయడంతో సమీపంలోని చాట్‌బండి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. వారిలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో హరిబాబు తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు వీడియో దృశ్యాల ఆధారంగా తెలుస్తుంది. వారిలో ఒకరు కారు నుంచి దిగి హరిబాబుపై దాడి చేసినట్లు దృశ్యాల్లో కనిపించింది. ఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు.
ఇవి కూడా చదవండి
అసలేం జరిగిందంటే?
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి(19), కోరుట్ల పట్టణంలోని ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబును వివాహం చేసుకుంది. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న వైష్ణవి హత్యకు గురైంది. ఈ కేసులో హరిబాబుపై హత్యారోపణలు వచ్చాయి. వైష్ణవి గొంతు నులిమి, చేతులు, నుదిటిపై కత్తితో గాయపరిచి హరిబాబు హత్య చేసినట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హరిబాబును అరెస్టు చేశారు. అయితే అతడు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో తాజాగా హరిబాబు హత్యకు గురయ్యాడు. తానే ఈ హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియోలో పేర్కొనడంతో ఈ కేసు కొత్త మలుపునకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.