Headlines

గణేష్ శోభాయాత్రల్లో వికృత చేష్టలా..? సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్.. ఆధారాలతో పట్టి మరీ యాక్షన్!


హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు. గణేష్ శోభాయాత్రల్లో వికృత చేష్టలు, అసభ్య ప్రవర్తనకు పాల్పడినా, ఇతర నిబంధనలను ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల సోషల్ మీడియా బృందాలు శోభాయాత్రలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఇప్పటికే పలు ఉల్లంఘనలను గుర్తించి నమోదు చేశాయని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలు పూర్తైన తర్వాత అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

మరోవైపు మహిళలు, యువతుల భద్రత కోసం హైదరాబాద్ నగర పోలీస్ షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. సీపీ సజ్జనార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ మండపాలతో పాటు ప్రధాన నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను విస్తృతంగా మోహరించారు.

ఈ సందర్భంగా ఈవ్ టీజింగ్, వేధింపులు, ఇతర అభ్యంతరకర కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 1,530 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారిలో 724 మందిని వెరిఫికేషన్ అనంతరం కౌన్సెలింగ్ చేసి హెచ్చరించి వదిలేశారు. మరో 48 మందికి శిక్ష పడింది. మహిళలు, యువతుల భద్రతకు భంగం కలిగించే చర్యలను అడ్డుకునేందుకు పోలీసులు ఉత్సవాల ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *