Headlines

Ravi Shastri: కంటి చూపు పోయినా కనికరం లేదాయె.. పాక్ నాయకుల తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం


Ravi Shastri: పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర సంతాపం, ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడం, ఆయన కుడికంటి చూపు కేవలం 15 శాతానికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని ఇలా అమానుషంగా చూడటం సరికాదని రవిశాస్త్రి స్పష్టం చేశారు.

మానవత్వంతో చూడండి

రిపబ్లిక్ వరల్డ్‌తో మాట్లాడిన రవిశాస్త్రి, ఒక మనిషిగా ఇమ్రాన్ ఖాన్‌కు జరుగుతున్న అన్యాయం చూసి షాక్‌కు గురయ్యానని తెలిపారు. రాజకీయం ఏదైనా కావచ్చు కానీ ఒక గొప్ప క్రీడాకారుడిని జైలు గదికే పరిమితం చేసి సరైన వైద్యం అందించకపోవడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు అందరూ ఇదే భావనతో ఉన్నారని, మానవత్వ కోణంలో ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

యంగ్ టీమ్‌తో వరల్డ్ కప్ గెలిచిన వీరుడు

ఇమ్రాన్ ఖాన్ నాయకత్వ పటిమను రవిశాస్త్రి కొనియాడారు. 1992లో 40 ఏళ్ల వయసులో యువ క్రికెటర్లను నడిపిస్తూ పాకిస్తాన్‌కు ప్రపంచ కప్ అందించడం చిన్న విషయమేమీ కాదన్నారు. మైదానంలో జట్టును ముందుకు నడిపించే విధానం, యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే గుణం ఆయనను ఒక గొప్ప లీడర్‌గా నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు.

గౌరవం ఇవ్వాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే అతికొద్ది మంది ప్రముఖుల్లో ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉంటారని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇష్టపడినా పడకపోయినా పాకిస్తాన్‌కు గ్లోబల్ ఐకాన్ ఆయనే అని స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ఇమ్రాన్ ఖాన్ నాయకత్వానికి, ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కంటి చూపు తగ్గిపోవడంపై ఆందోళన

2023 నుంచి జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం ఆయన కుడికంటి చూపు బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు దౌత్యపరమైన జోక్యం చేసుకుని ఇమ్రాన్ ఖాన్‌కు తగిన రక్షణ, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *