మేడ్చల్-మల్కాజిగిరి: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళను మోసం చేసి, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఆశ చూపి డబ్బులు వసూలు చేయడంతో పాటు, మహిళను బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. జగన్మోహన్ అనే వ్యక్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని నమ్మించాడు. ఈ క్రమంలో ఉన్నతాధికారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితురాలి నుంచి అడపా దడపా ఇప్పటి వరకు రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. అనంతరం మహిళను మల్లాపూర్ నుంచి కారులో భువనగిరి వైపు తీసుకెళ్లాడు నిందితుడు.
అధికారులను కలవాలంటూ అవుషాపూర్ ప్రాంతంలోని ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ ఉన్నతాధికారి ఉన్నాడని నమ్మించి మహిళను తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఆ తర్వాత వరంగల్ జాతీయ రహదారిపై కారులో నుంచి మహిళను కిందకు తోసేసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జగన్మోహన్‌ను అరెస్టు చేసిన విచారణ చేపట్టారు. ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేయడం, మహిళపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరానికి సంబంధించి పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. కేసులోని పూర్తి వివరాలు, ఇతర అంశాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..