Headlines

75 ఏళ్ల వయసులో ప్రేమ.. 63 ఏళ్ల వయసులో పెళ్లి! వృద్ధాశ్రమంలో ఒక్కటైన జంట..!


జీవితంలో ప్రేమకు వయసుతో సంబంధం లేదని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. సాధారణంగా 60, 70 ఏళ్లు దాటిన తర్వాత జీవితంలో కొత్త ఆశలు పెట్టుకోవడం కష్టమని చాలామంది భావిస్తారు. కానీ 75 ఏళ్ల కన్హయ్య లాల్, 63 ఏళ్ల సవీనా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఒంటరితనాన్ని ఎదుర్కొన్న వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా నిలిచి, చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉన్న అప్నా ఘర్ వృద్ధాశ్రమం వీరి పెళ్లికి వేదికైంది.

కష్టాలతో నిండిన కన్హయ్య జీవితం!

మండి జిల్లాలోని జంజేహ్లీ ప్రాంతానికి చెందిన కన్హయ్య లాల్ తన జీవితమంతా రైతుగా గడిపారు. ఆయనకు సొంత పిల్లలు లేకపోవడంతో తన భూమిని సోదరులకు అప్పగించారు. అయితే సుమారు నాలుగేళ్ల క్రితం కుటుంబ పరిస్థితుల కారణంగా ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చిందని సమాచారం. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన అడవిలోని ఓ గుహలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న న్యాయవాది ప్రకాష్ చంద్ బన్సల్ నేతృత్వంలోని బృందం ఆయనను గుర్తించి రక్షించింది. అనంతరం అప్నా ఘర్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించింది.

దారి తప్పి ఆశ్రమానికి చేరిన సవీనా!

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన 63 ఏళ్ల సవీనా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రయాణంలో దారి తప్పి నిరాశ్రయురాలయ్యారు. చివరకు సిమ్లా సమీపంలోని మషోబ్రా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు ఆమెను గుర్తించి రక్షించి మహిళా ఆశ్రమానికి తరలించారు. అనంతరం బిలాస్‌పూర్‌లోని అప్నా ఘర్ వృద్ధాశ్రమానికి తీసుకువచ్చారు.

స్నేహం కాస్తా ప్రేమగా.. చివరకు పెళ్లిగా!

ఒకే వృద్ధాశ్రమంలో ఉంటున్న కన్హయ్య లాల్, సవీనా మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ జీవితంలో ఎదుర్కొన్న ఒంటరితనం, కష్టాలు వారి మధ్య అనుబంధాన్ని పెంచాయి. క్రమంగా ఆ పరిచయం స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా మారింది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు, తోటి నివాసితుల సమక్షంలో సంప్రదాయ హిమాచలీ పద్ధతుల్లో వీరి వివాహం జరిపించారు.

పెళ్లి వేడుకల్లో మహిళా సంగీత్ నిర్వహించగా, వధూవరులు ఆనందంగా నృత్యం చేశారు. పాటలు, నవ్వులతో వృద్ధాశ్రమం సందడిగా మారింది. బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కిరణ్ భదానా కూడా నూతన దంపతులను కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల కన్హయ్య లాల్, 63 ఏళ్ల సవీనా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరి మనసులను హత్తుకుంటోంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ, ఆప్యాయతలకు వయసు అడ్డంకి కాదని ఈ జంట మరోసారి చాటిచెప్పింది. నిజంగా ప్రేమకు వయసుతో పనేముంది కదా!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *