ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ, హారర్ జానర్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఈ కోవలో రూపొంది, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మండల మర్డర్స్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ జాబితాలో నిలుస్తూ థ్రిల్లర్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సిరీస్ కథాంశం, నటీనటుల వివరాలపై ఆసక్తి నెలకొంది.
ఒక కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ కథలో వరుసగా భయంకరమైన హత్యలు చోటుచేసుకుంటాయి. ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు CIB అధికారి రియా థామస్ (వాణి కపూర్), సస్పెండ్ అయిన పోలీస్ అధికారి విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) రంగంలోకి దిగుతారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ హత్యలకు శతాబ్దాల నాటి రహస్య సమాజమైన ‘ఆయస్తి మండల్’ తో, అలాగే బాధితులతో ఉన్న సంబంధాలు బయటపడతాయి.
మిస్టరీ, అతీంద్రియ అంశాలు, మానసిక ఉత్కంఠ కలగలిసిన కథనంతో ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. రచయిత మహేంద్ర జఖార్ రాసిన ‘ది బుచర్ ఆఫ్ బెనారస్’ నవల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు గోపి పుత్రన్, మనన్ రావత్ దర్శకత్వం వహించారు.
ఇందులో వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తాతో పాటు సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్, రఘుబీర్ యాదవ్, జమీల్ ఖాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఒక్కొక్కటి సుమారు 40 నిమిషాల నిడివితో మొత్తం 8 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రూపొందింది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ‘మండల మర్డర్స్’, సుదీర్ఘకాలం పాటు నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ట్రెండ్ అవుతూ ఓటీటీ వీక్షకుల ఫేవరెట్ థ్రిల్లర్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.
సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ అంశాలను ఇష్టపడే వారికి ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఆసక్తికరమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్‌తో వాణి కపూర్ తన ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ‘మర్దానీ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన గోపి పుత్రన్ ఈ సిరీస్‌కు క్రియేటర్ మరియు సహ-దర్శకుడిగా వ్యవహరించడం విశేషం.




