ప్రస్తుతం హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే సిటీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ సిబ్బందికి ఆదేశించారు.
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ వాటర్ లాగింగ్ ప్రాంతాలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్ సీపీ ట్రాఫిక్ శ్రీ డి.జోయల్ డేవిస్, ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్ శ్రీ అవినాష్ కుమార్, ఐపీఎస్, శ్రీమతి కాజల్, ఐపీఎస్ లతో కలిసి ఆయన లక్డీకాపూల్, మసబ్ ట్యాంక్, పంజాగుట్ట శ్మశాన వాటిక, కేబీఆర్ పార్క్ జంక్షన్, తదితర వాటర్ లాగింగ్ పాయింట్లను సందర్శించారు.
రోడ్లపై వర్షపు నీరు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, నీరు సులువుగా పోయేలా తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖ, తదితర ప్రభుత్వ విభాగాలలో నిరంతరం సమన్వయం చేసుకుంటామని వివరించారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. వర్షాల సూచనపై వాతావరణ శాఖ, పోలీసుల సూచనలను గమనించి.. అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
రోడ్లపై ప్రయాణించేటప్పుడు మ్యాన్ హోల్స్, తెరిచిన డ్రైనేజీ లు, విద్యుత్ స్తంభాల పట్ల ప్రజలు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర ప్రజలకు ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బంది ఎదురైతే తక్షణ సహాయం కొరకు డయల్ 100/112ను సంప్రదించాల్సి దిగా విజ్ఞప్తి చేశారు.




