Mumbai Indians : ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. హార్దిక్ పాండ్యా తర్వాత స్కై కూడా అవుట్

Mumbai Indians : ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. హార్దిక్ పాండ్యా తర్వాత స్కై కూడా అవుట్


Mumbai Indians : ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. రాబోయే సీజన్ కోసం పాత సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, సరికొత్త యువ శకానికి తెరతీయాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ముంబై ఇండియన్స్ దాదాపు నిర్ణయించుకున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ మీడియా సంస్థ రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా కూడా ముంబైని వీడుతున్నాడనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వార్త అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని సమయంలో ముంబై జట్టును ముందుండి నడిపించాడు. అయితే కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఆయన గత సీజన్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20.77 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతకుముందు సీజన్ లో 700కి పైగా రన్స్ చేసిన స్కై.. ఈసారి పూర్తిగా తేలిపోయాడు. దీనికి తోడు బీసీసీఐ కూడా ఆయనను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించి, శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ వరుస పరిణామాల వల్ల సూర్య బ్రాండ్ వాల్యూ తగ్గిపోవడంతో.. రూ.16.35 కోట్ల భారీ శాలరీ ఉన్న ఆయనను వదిలేయాలని ముంబై ఫిక్స్ అయింది.

ముంబై ఇండియన్స్ వదిలేసినా కూడా సూర్యకుమార్ యాదవ్‌ను దక్కించుకోవడానికి ఐపీఎల్‌లోని మిగతా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. ముఖ్యంగా నార్త్, ఈస్ట్ ఇండియాకు చెందిన జట్లు ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ ఇస్తూ తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నాయి. గతంలో సూర్యకుమార్ యాదవ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ తన పాత హోమ్ ఫ్రాంచైజీ అయిన కేకేఆర్ జట్టులోకి ట్రేడింగ్ ద్వారా వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.

మరోవైపు ఐదుసార్లు ముంబైకి కప్పు అందించి పెట్టిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్ పై కూడా ముంబై ఇండియన్స్ ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మను.. వచ్చే సీజన్ లో ఆడతారా లేదా అని మేనేజ్‌మెంట్ స్వయంగా అడగనుంది. ఒకవేళ రోహిత్ ఆడటానికి సుముఖంగా ఉంటే.. ఐపీఎల్ 2027 సీజన్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ తరఫున ఆయనకు ఆఖరి సీజన్ కానుంది. రోహిత్ శర్మకు కూడా ముంబై ప్రస్తుతం రూ.16.30 కోట్ల భారీ జీతాన్ని చెల్లిస్తోంది.

సూర్యకుమార్, రోహిత్, హార్దిక్ లాంటి భారీ బడ్జెట్ సీనియర్ ప్లేయర్లను వదిలించుకోవడం ద్వారా ముంబై ఇండియన్స్ పర్స్ మనీ భారీగా పెరగనుంది. ఈ డబ్బుతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక సరికొత్త యంగ్ టీమ్‌ను బిల్డ్ చేయాలని ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు కుర్రాడు, టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ చుట్టూ కొత్త టీమ్‌ను నిర్మించనున్నారు. రాబోయే కాలంలో ముంబై ఇండియన్స్ జట్టుకు తిలక్ వర్మను పొటెన్షియల్ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *