‘ధురందర్ ‘, ‘ధురందర్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా ఈ సిరీస్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ బ్లాక్ బస్టర్స్ సినిమాలకు బాలీవుడ్ నుంచి పెద్దగా మద్దతు లభించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా కథాంశంపై బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ధురందర్’ సినిమాలపై ఖాన్‌ల మౌనం తీవ్ర చర్చనీయంశంగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమిర్ ఖాన్ రణ్ వీర్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు. కానీ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అధికారికంగా మాట్లాడలేదు. ఇప్పుడు, షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు ‘ధురందర్’ గురించి మాట్లాడారు. గణేష్ చతుర్థి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపేందుకు షారుఖ్ ఖాన్ ట్విట్టర్‌లో ‘#AskSRK’ అనే పేరుతో నెటిజన్లతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా, సరదాగా సమాధానాలిచ్చారు కింగ్ ఖాన్. ఈ సందర్భంగా తన లేటెస్ట్ సినిమా ‘కింగ్’ తో పాటు ‘ధురందర్’ సినిమాలపై షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఛాట్ సెషన్ లో భాగంగా ‘మీరు ధురందర్ చూశారా?’ అని ఒక అభిమాని అడగ్గా, దానికి షారుఖ్ ఖాన్ క్లుప్తంగా సమాధానమిస్తూ, ‘నాకు రెండు భాగాలు చాలా నచ్చాయి. చిత్ర బృందం మొత్తం అద్భుతంగా పనిచేసింది’ అని అన్నారు. ‘ధురందర్’ సినిమా గురించి షారుఖ్ ఖాన్ అధికారికంగా తన అభిప్రాయాన్ని పంచుకోవడం ఇదే మొదటిసారి. అంతకు ముందు ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడిన ఆమిర్ ఖాన్, ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృందం కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటివరకు ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలను అధికారికంగా ప్రశంసించడం గానీ, విమర్శించడం గానీ చేయలేదు.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ధురందర్’ చిత్రంలో రణవీర్ సింగ్ ఒక గూఢచారి పాత్రను పోషించారు. భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని గూఢచారి చిత్రాలలోకెల్లా అత్యంత వాస్తవికతను కలిగి ఉన్న ‘ధురందర్’ చిత్రం సహజంగానే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రం వసూళ్లలో అనేక రికార్డులను సృష్టించింది. రెండు సినిమాలు కలిపి ఏకంగా రూ. 3వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.