Headlines

బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్


బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు.

ఉపరితల ఆవర్తనం నుండి, మధ్యబంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి ఉందన్నారు. ఉత్తర కోస్తాంధ్ర నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో ఆదివారం (20-09-2026) రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని.. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *