Headlines

Andhra News: మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం.. ఏం చేశారో తెలిస్తే..


కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లుగా డాక్టర్ సిరి, రాజకుమారి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల సమయం కావడంతో నిత్యం ఏదో ఒక పనితో వారు ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ల పేర్లను వాడుకొని వాట్సాప్ వేదికగా మోసాలకు తెరలేపారు. కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి ఫొటో, పేరుతో పలువురి మొబైళ్లకు గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశాలు పంపారు.

తనకు అత్యవసరంగా రూ. 30,000 కావాలి, వెంటనే పంపించండి.. గంట తర్వాత రిటర్న్ చేస్తాను అని ఆ మెసేజ్‌లలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం కాస్తా కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆమె వెంటనే అప్రమత్తమయ్యారు. తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ పంపవద్దని, తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నంద్యాల కలెక్టర్ పేరుతోనూ వసూళ్లు

ఇదే తరహాలో నంద్యాల కలెక్టర్ రాజకుమారికి కూడా ఈ సైబర్ బెడద ఎదురైంది. ఆమె పేరు, ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఒక ఫోన్ నంబర్ ద్వారా జిల్లా వాసులకు డబ్బులు కోరుతూ సందేశాలు పంపించారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి ప్రజలను అలర్ట్ చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా డబ్బులు అడగనని స్పష్టం చేస్తూ, తన పేరుతో వచ్చే ఇలాంటి నకిలీ సందేశాలను నమ్మవద్దని, అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఒకే సమయంలో ఇద్దరు జిల్లాల మహిళా కలెక్టర్ల ప్రొఫైళ్లను దుర్వినియోగం చేస్తూ డబ్బులు కాజేసేందుకు కేటుగాళ్లు యత్నించడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆల్ ఇండియా సర్వీస్ (IAS) స్థాయి ఉన్నతాధికారుల పేర్లనే సైబర్ నేరగాళ్లు ఇలా వాడేస్తుంటే, ఇక సామాన్యుల భద్రత పరిస్థితి ఏమిటనే అంశంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *