Headlines

Basar IIIT: ఎల్‌నీనో ఎఫెక్ట్.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు దసరా సెలవులు పొడిగింపు!


తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ (IIIT Basara)పై ఎల్‌నీనో ప్రభావం పడింది. క్యాంపస్‌లో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన నీటిలో సగం మాత్రమే సరఫరా అవుతుండటంతో.. ప్రత్యామ్నాయ నీటి వనరును గుర్తించే వరకు కళాశాలను తిరిగి తెరవకూడదని నిర్ణయించారు. దీంతో దసరా సెలవుల అనంతరం శుక్రవారం నుంచి విద్యాసంస్థలు రీ ఓపెన్ కానున్న నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మాత్రం సెలవులు కొనసాగనున్నాయి.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌ (RGUKT) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో సుమారు 9 వేల మంది విద్యార్థులు, వెయ్యి మంది సిబ్బంది ఉన్నారు. వీరందరి అవసరాల కోసం రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. అయితే, ప్రస్తుతం ఎల్‌నీనో ప్రభావం కారణంగా గోదావరి నదిలోని ఇన్‌టేక్ వెల్ నుంచి రోజుకు కేవలం 10 లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుతున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఏ. గోవర్ధన్ వెల్లడించారు. దీంతో విద్యార్థుల అవసరాలకు సరిపడా నీటిని అందించడం, దాని నాణ్యతను నిర్ధారించడం వర్సిటీ యంత్రాంగానికి సవాలుగా మారింది.

బాసర ట్రిపుల్ ఐటీకి 2010లో గోదావరి నదిలో నిర్మించిన ఇన్‌టేక్ వెల్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఈ వ్యవస్థ క్యాంపస్ అవసరాలకు సరిపడా నీటిని అందించడంతో పాటు, మిగిలిన నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, ఎల్‌నీనో ఎఫెక్ట్‌తో వర్షాలు లేకపోవడం వల్ల బాసర సమీపంలో గోదావరి నీటిమట్టాలు గణనీయంగా తగ్గడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడం కూడా సరఫరాపై ప్రభావం చూపినట్లు వర్సిటీ సాంకేతిక విభాగం అధికారులు పేర్కొన్నారు.

సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నీటి కొరతను అధిగమించేందుకు గతంలో సుమారు 30 బోరుబావులు తవ్వించారు. వీటిలో కొన్ని దాదాపు 800 అడుగుల లోతు వరకు తవ్వినా నీరు లభించలేదని నివేదిక పేర్కొంది. దీంతో గోదావరి నీటిపైనే వర్సిటీ ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ నీటి వనరును గుర్తించడంపై అధికారులు దృష్టి సారించారు. వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత కళాశాల పునఃప్రారంభ తేదీని ప్రకటిస్తామని వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ తెలిపారు.

నీటి సమస్య కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూసేందుకు వర్సిటీ యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. అవసరమైతే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూస్తామని వైస్ ఛాన్స్‌లర్ వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC) మొదటి, రెండో సంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌ కోర్సుల్లో E1 నుంచి E4 వరకు విద్యార్థులు చదువుతున్నారు. క్యాంపస్‌లో నీటి సమస్య పరిష్కారమై, సరఫరా సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తరగతుల పునఃప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు తాగునీరు, ఇతర అవసరాలకు సరిపడా నీరు అందించడం అత్యవసరంగా మారిన నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ నీటి వనరును అధికారులు ఎంత త్వరగా గుర్తిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *