Headlines

Director VV Vinayak : ఆ హీరోతో నా సినిమా మిస్సైంది.. పడుంటేనా మరోలా ఉండేది.. వివి వినాయక్..


తెలుగు సినీ పరిశ్రమలో మాస్ కమర్షియల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, రాబోయే ప్రాజెక్టులు, అలాగే వ్యక్తిగత జీవితంలోని విషాద జ్ఞాపకాలపై మనసు విప్పి మాట్లాడారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించినప్పటికీ, నాగార్జునతో మాత్రం పూర్తిస్థాయి సినిమా చేయలేకపోవడంపై ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునతో ‘రాఖీ’ చిత్రంలోని ఒక పాటలో మాత్రమే కలిసి పనిచేశానని, అయితే ఆయనతో ఒక పకడ్బందీ, పూర్తిస్థాయి సినిమా చేయాలనే కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని వినాయక్ తెలిపారు. గతంలో ఒకటి రెండు సార్లు చర్చలు జరిగినా, అది కార్యరూపం దాల్చలేదని గుర్తుచేసుకున్నారు. ఇక అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుతూ.. అఖిల్‌కు మరో హిట్ అందించాల్సిన బాధ్యత తన మనసులో ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు గతంలో ఎన్టీఆర్‌తో ‘దానవీరశూరకర్ణ’ వంటి పౌరాణిక చిత్రం చేయాలనుకున్నా కుదరలేదని, అలాగే ‘అదుర్స్’ సీక్వెల్‌కు మళ్లీ అలాంటి అద్భుతమైన కథ దొరకడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ‘అదుర్స్’ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఎన్టీఆర్ నటన అన్నీ అద్భుతంగా నిలిచాయని అన్నారు.

తన జీవితంలోని అత్యంత కష్టమైన రెండు సంవత్సరాలలో తన తల్లిదండ్రులను కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వినాయక్ విచారం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సినిమాల్లోకి వెళ్లొద్దని చెప్పిన తన తండ్రి, తన విజయాన్ని చూసి ఎంతో గర్వపడేవారని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు దారిపొడవునా స్నేహితులకు ఫోన్ చేసి తన గురించి గొప్పగా చెప్పుకునేవారని తెలిపారు.

తన తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించానని వినాయక్ వివరించారు. ప్రముఖ వైద్యులను సంప్రదించడంతో పాటు, జపాన్‌కు తీసుకెళ్లి మైక్రో సర్జరీ కూడా చేయించానని చెప్పారు. చికిత్స తర్వాత ఆరోగ్యం కొంత మెరుగుపడినా, రహస్యంగా పొగతాగే అలవాటు తిరిగి క్యాన్సర్‌ను తీవ్రతరం చేసిందని, చివరికి ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి తిరిగి లేవలేకపోయారని ఆవేదనగా పంచుకున్నారు. ఆ తర్వాత తన తల్లి కూడా చిన్న జ్వరం వచ్చి నెల రోజుల్లోనే ఆకస్మికంగా మరణించారని వినాయక్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *