IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా భారీ కుంభకోణం.. డైరెక్టర్ టిక్కెట్లే వాడేసి వీఐపీ గ్యాలరీలోకి వచ్చిన కేటుగాళ్లు

IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా భారీ కుంభకోణం.. డైరెక్టర్ టిక్కెట్లే వాడేసి వీఐపీ గ్యాలరీలోకి వచ్చిన కేటుగాళ్లు


IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా భారీ కుంభకోణం.. డైరెక్టర్ టిక్కెట్లే వాడేసి వీఐపీ గ్యాలరీలోకి వచ్చిన కేటుగాళ్లు

IPL Ticket Fraud : ఐపీఎల్ అంటేనే భారీ అంచనాలు, వెలుగుజిలుగులు.. కానీ అదే వెలుగుల వెనుక చీకటి దందా బయటపడింది. అది కూడా సామాన్య ప్రజలు కూర్చునే గ్యాలరీలో కాదు, ఏకంగా విఐపి (VIP) సెక్షన్లోనే ఈ డ్రామా చోటుచేసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పోలీసుల వరకు చేరింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ ఆనంద్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆనంద్ వర్మ తన అతిథులతో కలిసి స్టేడియంలోని హాస్పిటాలిటీ (VIP) విభాగానికి వెళ్లగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న టిక్కెట్లు చెల్లవని, అవి అప్పటికే స్కాన్ అయిపోయాయని సెక్యూరిటీ చెప్పడంతో ఆనంద్ వర్మ షాక్ తిన్నారు.

డూప్లికేట్ టిక్కెట్ల మాయాజాలం

అసలైన టిక్కెట్లు తన చేతిలో ఉండగానే, ఆ బార్‌కోడ్స్‌ను ఎవరో అక్రమంగా వాడేసి స్టేడియం లోపలికి వెళ్లిపోయారని ఆనంద్ వర్మ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. “అనధికార వ్యక్తులు నకిలీ టిక్కెట్ల ద్వారా లేదా బార్‌కోడ్ మానిప్యులేషన్ ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నారు. అసలైన టిక్కెట్ హోల్డర్లను గేటు దగ్గరే ఆపేస్తున్నారు. ఇది కేవలం మోసం మాత్రమే కాదు, భద్రతా పరమైన ముప్పు కూడా” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.

సాంకేతిక లోపమా ? లేక ఏదైనా కుట్రనా?

ఈ వ్యవహారంపై డిడిసిఏ సెక్రటరీ అశోక్ శర్మ మరోలా స్పందించారు. ఇది స్కామ్ కాదని, కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. “కొన్నిసార్లు స్కానర్లు బార్‌కోడ్‌ను సరిగా రీడ్ చేయలేవు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది” అని ఆయన సమర్థించుకున్నారు. అయితే, ఒక డైరెక్టర్ స్థాయి వ్యక్తికే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్య ప్రేక్షకుల పరిస్థితి ఏంటని క్రీడా ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సహకారం లేకుండా ఇలాంటి టిక్కెట్ల దందాలు జరగవని ఆనంద్ వర్మ బలంగా నమ్ముతున్నారు.

ముందుకు రానున్న మ్యాచ్‌లపై ఆందోళన

ఢిల్లీలో ఈ సీజన్ లో ఇంకా ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హోమ్ గ్రౌండ్. ఇక్కడ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టిక్కెట్ల నిర్వహణపై ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడాల్సి ఉంది. టిక్కెట్ల దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరో తేలకపోతే, రాబోయే మ్యాచ్‌ల్లో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *