బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి త్వరలో ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రానున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్, డిసెంబర్ సమీక్ష సమావేశాల్లో రెపో రేటు పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాబోయే సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అక్టోబర్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు, డిసెంబర్ సమావేశంలో మరో 25 బేపిస్ పాయింట్ల పెంచుతారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారికి షాకింగ్‌గా చెప్పవచ్చు.
ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను కూడా పెంచుతాయి. దీంతో లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐ పెరగడంతో పాటు కొత్తగా రుణాలు తీసుకునేవారికి కూడా వడ్డీ రేటు పెరగుతుంది. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినవారికి మాత్రం వడ్డీ రేట్లు పెరగడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడంతో పాటు రూపాయి విలువను స్థిరీకరించే లక్ష్యంతో ఆర్బీఐ రెపో రేటును పెంచాలని చూస్తోంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రీసెర్చ్ రిపోర్టులో తాజాగా పేర్కొంది. అక్టోబర్ ద్రవ్య విధాన పరపతి సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశముందని గట్టిగా నమ్ముతున్నట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది. ఆగస్టులో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రెపో రేటును ఆర్బీఐ స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం 5.25 శాతం వద్ద కొనసాగించింది. తదుపరి సమావేశం అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు జరగనుంది.
ఆ తర్వాత డిసెంబర్లో మళ్లీ సమావేశం ఉంటుంది. ఈ రెండు సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున 50 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశముందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఆర్ధిక పరిస్థితులు మారుతున్న క్రమంలో ఈ పెంపు ఉండవచ్చని విశ్లేషించింది. అయితే ఆర్బీఐ రెపో రేటును పెంచిన వెంటనే వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫ్లోటింగ్ రేటు ఆప్షన్‌తో రుణం తీసుకున్నవారికి ఈఎంఐ పెరుగుతుంది. ఈఎంఐ పెంచడం లేదా లోన్ కాలపరిమితి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పెంచడం జరుగుతుంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా వడ్డీ రేట్లు పెరిగే అవకాశముందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. అయితే ద్రవ్యోల్బణం, జీడీపీ ఆధారంగా ఆర్బీఐ ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను మార్చుతూ ఉంటుంది. ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో దీని గురించి నిర్ణయం తీసుకుంటారు.