Headlines

నాకు షర్మిలతో పోలిక ఏంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్..


రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నేపథ్యం, పార్టీల విజయపరాజయాలువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో తనను పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ ఇద్దరి నేపథ్యాలు, రాజకీయ ప్రయాణాలు పూర్తిగా భిన్నమైనవని తెలిపారు. తనకు షర్మిలకు పోలికేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసిన షర్మిల, చివరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీకి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తాను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డనని, ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకత్వమే నిలబడుతుందని స్పష్టం చేశారు.

కేసీఆర్, జగన్ విజయాలే స్ఫూర్తి

రాజకీయాల్లో కొత్త పార్టీలు పెట్టి విఫలమైన విజయశాంతి, దేవేందర్ గౌడ్, ఇంద్రారెడ్డి వంటి వారి ఉదాహరణలను తాను ప్రామాణికంగా తీసుకోనని కవిత తెలిపారు. కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల విజయ ప్రస్థానాలే తనకు ఆదర్శమని అన్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ సాధించిన విజయాలు, రాజకీయ వ్యూహాలు తనకు మార్గదర్శకమని, కేసీఆర్ తయారు చేసిన కోట్లాది మంది ఉద్యమ సైనికులలో ఒకరిగా తాను రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని వెల్లడించారు.

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే

తన రాజకీయ ప్రస్థానం వ్యక్తిగత లాభాల కోసమో, మంత్రి పదవుల ఆశతోనో సాగడం లేదని కవిత స్పష్టం చేశారు. రొటీన్ ప్రసంగాలు, కాంప్రమైజ్ రాజకీయాలు చేయడం తన ఎజెండా కాదన్నారు. సమాజంలో నిజమైన మార్పు తీసుకురావడమే లక్ష్యమని, తన ఆలోచనల్లో చిత్తశుద్ధి ఉందని అన్నారు. అంబేద్కర్‌, జ్యోతిరావ్ ఫూలే వంటి మహనీయుల ఆలోచనల ఆధారంగానే సమాజంలో పూర్తి స్థాయి విముక్తి, సాధికారత రావాల్సి ఉందని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన సామాజిక న్యాయం అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని, క్షేత్రస్థాయి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తానని కవిత ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *