Physically Disabled Rider Climbs Stairs To Deliver Order But Customer Cancels Order
డెలివరీ బాయ్స్ ఎన్నో కష్టాలు పడుతూ మన ఇంటి వద్దకే ఆహారం తీసుకొస్తుంటారు. ఎండనక, వాననక, హెవీ ట్రాఫిక్ లో సైతం పనిచేస్తుంటారు. శారీరక వైకల్యం ఉన్న ఓ డెలివరీ బాయ్ కష్టపడి మెట్లు ఎక్కి ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్లాడు. తీరా కస్టమర్ ఇంటికి చేరుకున్నాక ఊహించని షాక్ తగిలింది.
రూ.50 మ్యాగీ ప్యాకెట్ కోసం ఆర్డర్
నిహిర్ అనే యువకుడు జొమాటోలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి శారీరక వైకల్యం ఉంది. నడవడానికి, కదలడానికి ఇబ్బంది పడుతుంటాడు. అయినప్పటికీ తనకు చేతనైనంత వరకు కష్టపడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు కస్టమర్ రూ.50 విలువైన మ్యాగీ ప్యాకెట్ ఆర్డర్ చేశారు. ఆ ఆర్డర్‌ను తీసుకుని నిహిర్ కస్టమర్ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ ఇల్లు మెట్లపై ఉండటంతో పైకి వెళ్లడం తనకు కష్టమని భావించాడు. వెంటనే కస్టమర్‌కు ఫోన్ చేసి శారీరక వైకల్యంతో ఉన్నానని, మెట్లు ఎక్కడం కష్టమని చెప్పాడు. దయచేసి కిందకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని కోరాడు.
కిందకు రావడానికి నిరాకరించిన కస్టమర్
కస్టమర్ అందుకు అంగీకరించలేదు. రూ.50 విలువైన మ్యాగీ ప్యాకెట్ ఆర్డర్ చేశామని, అదనంగా డెలివరీ ఛార్జీలు కూడా చెల్లించామని పార్శిల్ తీసుకోవడానికి తామెందుకు కిందకు రావాలని ప్రశ్నించినట్లు నిహిర్ తెలిపాడు. దీంతో చేసేదేమీ లేక నిహిర్ స్వయంగా పైకి వెళ్లాలని క్రెచెస్ ను కిందనే ఉంచి, ఒక్కో మెట్టు నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించాడు. ప్రతి అడుగు వేయడానికి ఎంతో కష్టపడుతూ చివరకు కస్టమర్ ఇంటి వద్దకు చేరుకున్నాడు.కానీ అక్కడికి వెళ్లాక తెలిసిన విషయం తీవ్రంగా నిరాశపరిచింది. అప్పటికే కస్టమర్ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశారు. ఇంత కష్టపడి మెట్లు ఎక్కి వచ్చినా చివరకు ఆర్డర్ రద్దు కావడంతో నిహిర్ బాధపడ్డాడు.
నిహిర్కు మద్దతుగా నెటిజన్లు
తనకు ఎదురైన ఈ అనుభవాన్ని నిహిర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన వైకల్యం, రోజూ ఎదుర్కొనే ఇబ్బందులను వివరిస్తూ జరిగిన ఘటనను చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కస్టమర్ ప్రవర్తనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి సేవలు పొందుతున్నంత మాత్రాన ఎదుటివారి పరిస్థితిని పట్టించుకోకుండా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. డెలివరీ ఏజెంట్లు కూడా మనుషులేనని, వారి కష్టాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘డబ్బు, హోదా కంటే మానవత్వం ముఖ్యం. ఎదుటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. వారి పని, కష్టం, నిజాయితీని గౌరవించాలి. మీకు ఇలా జరిగినందుకు బాధగా ఉంది’ అని కామెంట్ చేశారు. మరికొందరు నిహిర్ పట్టుదలను ప్రశంసించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పనిచేస్తూ ముందుకు సాగుతున్న అతడికి అభినందనలు తెలిపారు. ఇలాంటి డెలివరీ ఏజెంట్ల పట్ల ప్రతి ఒక్కరూ మరింత గౌరవంగా, దయతో వ్యవహరించాలని కోరారు.
మరో వీడియోతో వివరణ ఇచ్చిన నిహిర్
ఈ ఘటనపై కొందరు వీడియో తీస్తున్న వ్యక్తికి పార్శిల్ ఇచ్చి, ఆయన ద్వారా కస్టమర్‌కు అందించవచ్చు కదా అని ప్రశ్నించారు. దీనిపై నిహిర్ మరో వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. తనకు ఎదురైన ఘటనను మాత్రమే చూపించడం తన ఉద్దేశం కాదని, తనలాంటి శారీరక వైకల్యం ఉన్న డెలివరీ ఏజెంట్లు రోజూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందరికీ తెలియజేయాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఒక చిన్న ఆర్డర్ వెనుక కూడా డెలివరీ ఏజెంట్ ఎంత కష్టపడాల్సి వస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. మనకు ఆహారం అందించే వారి శ్రమను గుర్తించి, వారి పరిస్థితులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత.