Headlines

100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. స్పందించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే..


ఏపీలో పట్టణ పోరుపై SEC సంచలన నిర్ణయం తీసుకుంది.. 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ SEC ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచింది. అధికారుల నివేదికల ఆధారంగా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. సుప్రీం ఆదేశానుసారం నోటిఫికేషన్‌ను సవరించేలా.. రాష్ట్ర ఎన్నికల సంఘంచర్యలు తీసుకోనుంది. అయితే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ యథావిధిగా జరగనుంది.. కాగా.. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను ఈనెల 25 వరకు వాయిదా వేయాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశించింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల నుంచి వినతులు, ఆధారాలను పరిశీలించాలని కూడా ఎన్నికల సంఘానికి సూచించింది.

స్పందించిన టీడీపీ, జనసేన, బీజేపీ

కాగా.. SEC నిర్ణయంపై కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ స్పందించాయి. ఎన్నికల సంఘం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న కూటమి పార్టీలు.. ఉమ్మడి ప్రెస్‌నోట్‌‌ను రిలీజ్‌ చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలను తొలి రోజు నుంచే.. అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించాయి. కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని విమర్శించిన కూటమి నేతలు.. ఎన్నికలు ఆపేందుకు కోర్టుల్లో 59 పిటిషన్లు వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరిగితేనే.. 16వ ఆర్థిక సంఘం, కేంద్ర నిధులు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సమగ్రాభివృద్ధికి స్థానిక సంస్థల బలోపేతం కీలకమని.. ఎన్నికలు అడ్డుకునేందుకు YCP హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించింది. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా.. ఎన్నికలు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో నామినేషన్లు వేయకుండా ప్రతిపక్షనేతలను భయపెట్టారన్న కూటమి నాయకులు.. బలవంతపు ఏకగ్రీవాలు, అక్రమాలపై.. అప్పటి ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. SEC నిర్ణయాన్ని గౌరవిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, మాధవ్‌.. ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

వైసీపీ న్యాయపోరాటం..

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న YCP… న్యాయపోరాటానికి దిగింది. చెప్పినట్టుగా సుప్రీం తలుపు తట్టిన వైసీపీ… బలంగా వాదనలు వినిపించింది. అటు SEC తరపున, ఇటు ప్రభుత్వం తరపున వాదనలు విన్న ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానిక ఎన్నికలు చాలా కీలకమని అభిప్రాయపడిన అత్యున్నత ధర్మాసనం… అందరికీ పోటీచేసే అవకాశం కల్పించేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. అలాంటి పరిస్థితులు లేకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోబోవని కీలక వ్యాఖ్యలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *