Headlines

కేంద్రమంత్రితో సీఎం రేవంత్ కీలక భేటీ.. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల మంజూరుకు ప్రతిపాదనలు..


ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ – పుణె, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమిక్షించిందని సీఎం అశ్విని వైష్ణవ్ కి తెలిపారు. కొన్ని మార్పులను సూచిస్తూ కేంద్రానికి ఇప్పటికే పునఃపరిశీలన ప్రతిపాదనలు పంపామని వివరిస్తూ,కేంద్రం అలైన్‌మెంట్‌ను ఆమోదించిన వెంటనే భూ సేకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.

రీజినల్ రింగ్ రైలు మార్గానికి విజ్ఞప్తి

హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల సరసన, అదే మార్గంలో రీజినల్ రింగ్ రైలు అలైన్‌మెంట్ పూర్తిచేసి మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిపో నిర్మాణానికి అవసరమైన 409 ఎకరాల 1 గుంట భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని గుర్తుచేస్తూ, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నూతన రైల్వే లైన్ల మంజూరుకు ప్రతిపాదనలు

పారిశ్రామిక, రవాణా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు నూతన రైలు మార్గాలను తక్షణమే మంజూరు చేయాలని సీఎం కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసరాల్లో భారీగా సున్నపురాయి నిక్షేపాలు బయటపడటంతో, ఆ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ హబ్‌గా మార్చే ప్రణాళికలు ఉన్నాయని, వికారాబాద్ కృష్ణా లైన్ ఎంతో కీలకమని వివరించారు. పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ), కాచిగూడ – జగ్గయ్యపేట (250 కి.మీ), బోధన్ – లాతూర్ (175 కి.మీ), డోర్నకల్ – గద్వాల్,కల్వకుర్తి – మాచర్ల,అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ రాష్ట్ర రవాణా రంగానికి, ఆర్థిక రంగానికి ఊతమిచ్చే ఈ ప్రాజెక్టులకు రైల్వే శాఖ పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *