హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల కొన్ని రోజుల పాటు వాతావరణం మారిపోనుందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని.. దీని ప్రభావంతో శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతోపాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. రహదారులు తడిగా, జారే స్వభావంతో ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉన్నందున తదనుగుణంగా రెస్క్యూ బృందాలు, మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని APSDMA తెలియజేసింది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా – రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం (31-10-2026) మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.





