Headlines

కూరలో నత్తల మందు కలిపిన మహిళ.. తిన్న వెంటనే నాలుక మొద్దుబారడంతో వెలుగులోకి!


ఆస్ట్రేలియాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి పనిచేసే మహిళ బాక్స్‌లోని కూరలో ఓ ఉద్యోగిని నత్తలను చంపేందుకు ఉపయోగించే విషపూరిత మందు కలిపింది. ఈ ఘటనపై నెలల తరబడి విచారణ జరిపిన పోలీసులు తాజాగా 43 ఏళ్ల మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఆస్ట్రేలియా పెర్త్‌లోని ఓల్డ్‌బరీలో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43 ఏళ్ల మహిళ ఇంట్లో తయారు చేసిన కూరను తన సహోద్యోగులతో పంచుకునేందుకు కార్యాలయానికి తీసుకొచ్చింది. ఉదయం టీ బ్రేక్ సమయంలో అందరూ ఆ కూరను తిన్నారు. అప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే మధ్యాహ్న భోజనం కోసం మిగిలిన కూరను తినేందుకు వెళ్లిన ఆ మహిళకు అందులో ఏవో ఆకుపచ్చ రంగు గింజలు కనిపించాయి. అనుమానం వచ్చి కొద్దిగా రుచి చూసింది. అంతే.. వెంటనే ఆమె నాలుక మొద్దుబారిపోయింది. దీంతో ఆహారంలో ఏదో విషపదార్థం కలిసిందని గుర్తించి అప్రమత్తమైంది.

కెమికల్ షెడ్ నుంచి వచ్చి.. కూరలో విషం కలిపిందా?

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు ముందుగా కార్యాలయంలోని రసాయనాలు నిల్వ చేసిన గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత సిబ్బంది గదిలోకి వెళ్లి, ఎవరూ లేని సమయంలో అక్కడ ఉంచిన కూరలో విషపదార్థం కలిపింది. బాధితురాలు ఆ కూరను వెంటనే పోలీసులకు అప్పగించగా పరీక్షించిన నిపుణులు ఆకుపచ్చ రంగు గింజలు నత్తలను చంపేందుకు ఉపయోగించే పెల్లెట్స్‌ అని నిర్ధారించారు. వీటిలో ఉండే మెటల్డిహైడ్‌ (Metaldehyde) అనే ప్రమాదకర రసాయనం మనుషుల శరీరంలోకి వెళితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

నెలల తరబడి విచారణ.. చివరకు అరెస్ట్

ఈ ఘటనపై పోలీసులు నెలల తరబడి విచారణ జరిపారు. బాధితురాలికి, నిందితురాలికి వ్యక్తిగత పరిచయం ఉందనీ, గతంలో వారిద్దరి మధ్య సంబంధం కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. చివరకు గోల్డెన్ బే ప్రాంతానికి చెందిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి ప్రాణాలకు, ఆరోగ్యానికి భద్రతకు ప్రమాదం కలిగించే ఉద్దేశంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. ఘటనపై పశ్చిమ ఆస్ట్రేలియా పోలీస్ కమిషనర్ కోల్ బ్లాంచ్ స్పందించారు. కూరలో ఏదో తేడా ఉందని బాధితురాలు గుర్తించి వెంటనే అప్రమత్తం చేయడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. విషపదార్థం కారణంగా మరణం సంభవించే అవకాశం ఉందని తెలిపారు.  సహోద్యోగి ఆహారంలో విషం కలిపినట్లు వచ్చిన ఆరోపణలు ఆస్ట్రేలియాలో కలకలం రేపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *