తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. వారిలో హీరోయిన్ ఊహకు ప్రత్యేక స్థానం ఉంది. 90వ దశకంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే నటుడు శ్రీకాంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమై కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు. హీరోయిన్ ఊహ అసలు పేరు శివరంజని. ‘ఆమె’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. తొలి చిత్రంతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాతో నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
నటుడు శ్రీకాంత్‌తో కలిసి ‘ఆమె’, ‘కూతురు’, ‘ఆయనకి ఇద్దరు’ వంటి చిత్రాల్లో ఊహ నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం తమ ప్రేమ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఊహ సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఊహ, శ్రీకాంత్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు రోషన్, మేధ, రోహన్. పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే ‘నిర్మల కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ సినిమాలతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తాజాగా ‘ఛాంపియన్’ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కుమారుడి సినీ ప్రయాణంలో ఊహ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన పిల్లల కెరీర్, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఇక ఊహ గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఆమె మేనమామ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నటుడు. ఆయనే ప్రముఖ నటుడు పీఎల్ నారాయణ. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. మలయాళీ కుటుంబానికి చెందిన పీఎల్ నారాయణ గుంటూరులో జన్మించి పెరిగారు. బాపట్లలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఒంగోలుకు వెళ్లి నాటక రంగంలో అడుగుపెట్టారు. నాటకాలపై ఉన్న ఆసక్తితో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన నటించిన ‘కుక్క’ నాటకానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఈ గుర్తింపుతో ఆయనకు సినిమా అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పీఎల్ నారాయణ వెనుదిరిగి చూసుకోలేదు. లాయర్, ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకుడు, కార్మిక నాయకుడు, బిక్షగాడు, తాగుబోతు.. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. ప్రతి పాత్రలోనూ తనదైన నటనా శైలితో ప్రత్యేక ముద్ర వేశారు. మొత్తానికి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఊహ కుటుంబంలోనే ఇంతటి గొప్ప నటుడు ఉండటం విశేషం. హీరోయిన్గా ఊహ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే.. తనదైన నటనతో పీఎల్ నారాయణ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి