పెళ్లి సందడిలో పెను విషాదం.. ఒకే ప్రమాదంలో ఆరుగురు మహిళల దుర్మరణం..!

పెళ్లి సందడిలో పెను విషాదం.. ఒకే ప్రమాదంలో ఆరుగురు మహిళల దుర్మరణం..!


ఉత్తరప్రదేశ్‌లోని బుడౌన్ జిల్లాలో ఒక ఘోర సంఘటన జరిగింది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆరుగురు మహిళలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా వారు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బదౌన్-మధుర రహదారిపై ఉఝాని పోలీస్ స్టేషన్ పరిధిలోని బుట్ల గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గథౌనా గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకలో భాగంగా నిర్వహించే సంప్రదాయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహిళలు ఈ-రిక్షాలో బయలుదేరారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఈ-రిక్షాను ఢీకొట్టింది.

ప్రమాదం తీవ్రతకు ఈ-రిక్షా పూర్తిగా ధ్వంసమైంది. ఐదుగురు మహిళలు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నలుగురిని వెంటనే బదౌన్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మహిళల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అవ్నీష్ కుమార్ రాయ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకితా శర్మ వెంటనే ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారి పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం బరేలీ రేంజ్ డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.

ఈ విషాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ప్రార్థించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *