దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్


అంతా స్నేహితులే.. ఎప్పుడూ కలిసి తిరుగుతూ మద్యం పార్టీలు చేసుకుంటుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గ్యాంగ్‌లో ఒకడైన అశోక్‌ అనే వ్యక్తిని నలుగురు స్నేహితులు బయటకు తీసుకెళ్ళి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవలే హత్యకు దారితీశాయని, ముఖ్యంగా ఓ యువతి విషయంలో చెలరేగిన వివాదమే ఈ దారుణానికి కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్‌ మృతదేహాన్ని ఒంగోలు జిజిహెచ్‌కు తరలించిన అదే సమయంలో నిందితుల్లో ఒకరిని పట్టుకుని వైద్య పరీక్షల కోసం జిజిహెచ్‌కు తీసుకురావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడిపై మృతుడి బంధువులు దాడికి ప్రయత్నించడంతో ఆస్పత్రిలో భయానక వాతావరణం నెలకొంది. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై కొద్దిసేపు రాస్తాకోకో చేశారు.

చంపి ఫోన్‌ చేసి మరీ చెప్పారు..

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలోని ఎస్‌సి కాలనీలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన అశోక్‌ అనే వ్యక్తిని అతనితో స్నేహంగా ఉంటున్న నలుగురు యువకులే కత్తులతో దారుణంగా పొడిచి చంపేశారు. రాత్రి పూట పని ఉందంటూ అశోక్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి అనంతరం రోడ్డుపై కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలతో అశోక్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత నిందితులే అశోక్‌ బంధువులకు ఫోన్‌ చేసి చంపేశామని తెలియచేశారు. ఎక్కడ చంపి పడేశారో కూడా చెప్పారు. దీంతో అశోక్‌ బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. రోడ్డుపై అశోక్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

మద్యం, గంజాయి అలవాటు..?

హత్యకు గురైన అశోక్‌కు పెళ్లై, పిల్లలున్నారు. అతని స్నేహితులు అందరూ కలిసి పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ కాలనీలో ఉంటున్నారు. తరచూ మద్యం సేవిస్తుంటారు. కలిసి క్రికెట్‌ కూడా ఆడుతుంటారు. వీరిలో కొంతమందికి గంజాయి అలవాటు కూడా ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్నేహితులే అశోక్‌ను నమ్మకంగా ఇంటినుంచి తీసుకెళ్లి దారుణంగా చంపేయడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, వీరిలో కొంతమంది గంజాయి కూడా తాగుతుంటారని చెబుతున్నారు. మద్యం, గంజాయి మత్తులో చంపేశారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తమకు తెలియదని బంధువులు చెబుతున్నారు.

నిందితుడిపై బాధితుల దాడి యత్నం.. ఉద్రిక్తత

హత్యకు గురైన అశోక్‌ మృతదేహాన్ని ఒంగోలులోని జిజిహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో రాత్రి నిందితుల్లోని ఒకరిగా ఉన్న మధు అనే యువకుడ్ని పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించగా, అతడికి వైద్య పరీక్షల కోసం అదే జిజిహెచ్‌కు తరలించారు. అక్కడే ఉన్న మృతుని బంధువులు మధుపై దాడికి ప్రయత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితులను పోలీసులు అడ్డుకుని శాంతింపచేశారు. ఈ సందర్బంగా బాధితులు పోలీసుల వాగ్వివాదానికి దిగారు. అనంతరం బాధితుల దగ్గర నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని పోస్టుమార్టం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఈ హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తమకు అనుమానాలు ఉన్నాయని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఎస్‌ఐ మూడు స్టేట్‌మెంట్లు రాసి సంతకం పెట్టాలని కోరగా, అందుకు నిరాకరించి తమకు ఉన్న అనుమానాలతో ఫిర్యాదు ఇచ్చామని చెబుతున్నారు. హత్యకు గురైన అశోక్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు జిజిహెచ్‌ ఎదుట బంధువులు రాస్తారోకో చేశారు.

హత్యకు మోటివ్‌ ఇప్పుడే చెప్పలేం: పోలీసులు

అశోక్‌ హత్యకు స్నేహితుల మధ్య గొడవలతో పాటు గంజాయి మత్తు కూడా కారణంగా ఉందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు, గంజాయి సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ హత్య ఘటనపై పోలీసులు విచారిస్తున్నామని, ఇప్పుడే హత్యకు గల కారణాలను చెప్పలేమని పోలీసులు మాట్లాడేందుకు నిరాకరించారు. అశోక్‌ హత్యకు స్నేహితుల మధ్య గొడవేనా, లేక ఓ యువతి విషయంలో మనస్పర్ధలు వచ్చాయా? అన్న అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *