హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కజకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, MAK Projects ప్రైవేట్ లిమిడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి, దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక ప్రతినిధి సెర్జియో గోర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్‌లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్, ట్రంప్ టవర్, జాకబ్ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యంతో విలాసవంతమైన గోల్ఫ్ కమ్యూనిటీలు, బ్రాండెడ్ రెసిడెన్సీలు, మిశ్రమ వినియోగ జీవనశైలి ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
భారత్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన నివాస ప్రాజెక్టుల అభివృద్ధిలో MAK Projectsకు ఉన్న అనుభవాన్ని ప్రస్తావించిన డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే, పర్యాటక రంగానికి ఊతమిచ్చే, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను మధ్య ఆసియాలో అభివృద్ధి చేయాలనే తన దూరదృష్టిని వివరించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు, పెట్టుబడి అవకాశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై మరింత చర్చించేందుకు త్వరలో న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో మరోసారి సమావేశం కానున్నట్లు డా ఖాన్ తెలిపారు. ఈ భేటీ భారత్, అమెరికా, మధ్య ఆసియా దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.