Headlines

భారత్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం.. మార్చి నాటికి 55 వేల మరణాలు!


ఎల్‌నినో ప్రభావంతో 2027 మార్చి వరకు అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. తాజాగా క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన ఓ ట్రాకర్ రాబోయే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 3.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. భారత్‌లో సుమారు 55 వేల మరణాలు సంభవించవచ్చని షాకిచ్చింది.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎల్‌నినో!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎల్‌నినో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ ఏడాది మారుతోంది. 2026 సెప్టెంబర్ నాటికి పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 డిగ్రీలు పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన ఎల్‌నినో పరిస్థితుల్లో ఇదే అత్యధిక పెరుగుదల. అందుకే దీనికి ‘సూపర్ ఎల్‌నినో’గా నామకరణం చేశారు.

భారత్‌లో 55 వేల మరణాలు?

క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన ‘ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ ప్రకారం.. 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3.73 లక్షల మంది మరణిస్తారు. అత్యధిక మరణాలు గ్లోబల్ సౌత్‌ దేశాల్లో నమోదవుతాయి. ముఖ్యంగా భారత్‌లో అక్టోబర్ నుంచి మార్చి మధ్య 55 వేల మంది ప్రాణాలు కోల్పోవచ్చని ట్రాకర్ అంచనా వేసింది. వీరిలో అత్యధిక మరణాలు మార్చి నెలలోనే సంభవించే అవకాశం ఉందని షాకింగ్‌ వార్త వెల్లడించింది. నైజీరియాలో 56 వేల మరణాలు, ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్‌లో 19 వేల మంది అధిక ఉష్ణోగ్రతలకు మరణించే ప్రమాదం ఉంది.

ముంబైలోనూ పెరగనున్న కాలుష్యం?

ఎల్‌నినో ప్రభావంతో ముంబైలో వాయు కాలుష్యం పెరుగుతుంది. సాధారణంగా వేగంగా వీచే గాలులు నగరంలో కాలుష్యాన్ని ఒక చోట నిలవకుండా చేస్తాయి. అయితే గాలుల వేగం తగ్గితే నగరానికి సహజంగా లభించే ఈ రక్షణ తగ్గిపోతుంది. ఫలితంగా వాయు కాలుష్యం తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది.

డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి ఎల్‌నినో

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ ఏడాది ఎల్‌నినోపై హెచ్చరికలు జారీ చేసింది. 1950 తర్వాత ఇదే అత్యంత బలమైన ఎల్‌నినో అనీ డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చనీ హెచ్చరించింది. ఎల్‌నినో బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడితే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పు పెరుగుతుంది.

ఎల్‌నినో అంటే ఏంటి?

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగే వాతావరణ పరిస్థితి. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. సాధారణంగా ప్రతి రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి ఎల్‌నినో ఏర్పడుతుంది. ఇది దాదాపు 9 నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. ఎల్‌నినోకు వ్యతిరేకమైన పరిస్థితిని ‘లా నినా’ అంటారు. ఈ రెండింటి మధ్య తటస్థ వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.

మొత్తంగా ఈ ఏడాది ఎల్‌నినో తీవ్రత ప్రపంచ దేశాలకు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో అధిక వేడి సంబంధిత మరణాలపై వెలువడిన తాజా అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన ముందస్తు చర్యలు, ప్రజల్లో అవగాహన, వేడి నుంచి రక్షణ కల్పించే ఏర్పాట్లతో ముప్పును తగ్గించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *