
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పసివాడి ప్రాణం సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక మూగ, అమాయక పిల్లాడిని కాపాడే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, చిరంజీవిని సుప్రీమ్ స్టార్ స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఈ సినిమా నిర్మాణం వెనుక అనేక ఆసక్తికరమైన, సంచలనాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని దివంగత నటుడు, నిర్మాత GV నారాయణరావు గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. GV నారాయణరావు మలయాళంలో ఫాజిల్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ చిత్రం హక్కులను కొనుగోలు చేసి, చిరంజీవిని హీరోగా అనుకున్నారు. అయితే, మద్రాస్‌లో చిరంజీవికి కథ వినిపించగా, ఆయన తొలుత సంశయించారట. “ఏంటి నారాయణరావు.? పాటలు లేవు, ఫైట్లు లేవు. జనం నన్ను ఎలా ఆదరిస్తారు.?” అని చిరంజీవి ప్రశ్నించారట. దీనికి నారాయణరావు “ఇది నీకు, పిల్లల మనసులో నువ్వు ముద్ర వేసుకుంటావు. పిల్లల కోసం నువ్వు ఏ త్యాగం చేసినా, అది నీకు హైలెట్ అవుతుంది. ఈ సబ్జెక్టును చూడు. ఇది ఒక ఇన్నోసెంట్ మూగ పిల్లవాడిని సేవ్ చేయడమే కథ. అదే హీరోయిజం. నీకు అంత మంచి పేరు వస్తుంది” అని చిరంజీవిని ఒప్పించారు. చిరంజీవి సరే అన్నారట.
B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్
కానీ ఈలోపే అనుకోని మలుపు చోటుచేసుకుంది. చిరంజీవి చక్రవర్తి సినిమా షూటింగ్ నిమిత్తం బాంబే వెళ్లారు. అదే సమయంలో, నారాయణరావు భాగస్వామి హరిప్రసాద్, ఇదే మలయాళ చిత్రానికి డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసి, కృష్ణం రాజు హీరోగా పసివాడి ప్రాణం పేరుతోనే స్ట్రెయిట్ సినిమాను ప్రారంభించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో షూటింగ్ కూడా మొదలైంది. ఈ విషయం తెలిసిన నారాయణరావు షాక్ అయ్యారు. తాను లక్ష రూపాయలు పెట్టి స్ట్రెయిట్ రైట్స్ కొనుగోలు చేస్తే, డబ్బింగ్ రైట్స్‌తో స్ట్రెయిట్ సినిమా తీయడం అన్యాయమని భావించారట. వెంటనే నారాయణరావు చక్రవర్తి నిర్మాత అల్లు అరవింద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అల్లు అరవింద్ మొదట “చిరంజీవికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదా, వదిలేద్దాంలే నారాయణరావు” అన్నారట. కానీ నారాయణరావు పట్టువదలక “లేదు అరవింద్ గారు, నేను ఈ సబ్జెక్టు వదలను. ఈ సినిమా చిరంజీవి గారితోనే తీయాలి, ఇంకెవ్వరితో తీసినా కుదరదు” అని గట్టిగా చెప్పారు. అప్పుడు అల్లు అరవింద్ “అంతేనా అంటావా?” అనగా, “అంతే సార్” అని నారాయణరావు సమాధానమిచ్చారట.
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అనంతరం నారాయణరావు ఒక వ్యూహాత్మక చర్యకు దిగారు. కృష్ణం రాజు సినిమాకు కీలకమైన నటీనటులను నారాయణరావు అడ్డుకున్నారు. ఒరిజినల్ చిత్రంలో నటించిన బాలనటి సుజిత (అప్పట్లో ఐదేళ్ల పిల్ల) అడ్రస్ తెలుసుకుని, ఆమె తల్లితో సహా కేరళ నుంచి ట్రైన్‌లో వస్తుండగా స్టేషన్‌లోనే ఆమెను కలిసి, రూ. 5,000 ఇచ్చి బ్లాక్ చేశారు. అప్పటికే తన సినిమాల్లో నటించిన రఘువరన్‌కు ఫోన్ చేసి, తన చిత్రానికి డేట్లు ఇవ్వాల్సిందిగా కోరి బ్లాక్ చేశారు. విలన్ అసిస్టెంట్ ఆంటోనీని కూడా బ్లాక్ చేశారు. ఈ ముగ్గురు లేకపోతే సినిమాకు ఎమోషన్ ఉండదని, సినిమానే ఉండదని నారాయణరావు గ్రహించారు. చిరంజీవి బాంబే నుంచి రాగానే, నారాయణరావు అల్లు అరవింద్ ద్వారా కోదండరామిరెడ్డికి ఫోన్ చేయించారు. అల్లు అరవింద్ “రెడ్డి గారు, నారాయణరావు రైట్స్ కొనుక్కున్నాడంట, తను తీస్తానని గొడవ చేస్తున్నాడు, ఏం చేద్దాం?” అనగానే, కోదండరామిరెడ్డి వెంటనే తాను వచ్చేస్తున్నానని చెప్పారు. అలా పసివాడి ప్రాణం చిత్రం చిరంజీవి చేతికి వచ్చిందని నారాయణరావు గుర్తు చేసుకున్నారు.
నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.