Headlines

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? వారం రోజుల్లోనే.. దీపావళి పండక్కి ముందే శుభవార్త..


ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి లాటరీ పద్దతి ద్వారా ఇందిరమ్మ టవర్స్‌లలో ఇళ్లను కేటాయిస్తున్నారు. విడతల వారీగా లబ్దిదారులను ఎంపిక చేస్తుండగా.. ఇప్పటికే తొలి విడతలో నగర పరిధిలో కొంతమందికి లాటరీ నిర్వహించి ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇప్పుడు రెండో విడత ఇళ్ల మంజూరు కోసం లాటరీ నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. దసరా తర్వాత వారం రోజుల్లో లాటరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో దీపావళికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసి లబ్దిదారులను ఎంపిక చేపట్టనున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

రెండో విడతలో ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లోని ప్రజలకు ఇందిరమ్మ టవర్స్‌లో ప్లాట్లు కేటాయించనున్నారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. ఇప్పటికే ఈ నాలుగు నియోజకవర్గంలో భవనాలు నిర్మించేందుకు స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. హయత్ నగర్, నాంపల్లి, జమిస్థాపూర్, ఫలక్ నుమా ప్రాంతాల్లో లబ్దిదారులకు ఫ్లాట్లను అప్పగించనున్నారు. అర్హుల నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి వడపోత కార్యక్రమం చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన అనంతరం అర్హులను గుర్తిస్తున్నారు. అర్హులైనవారికి ఎస్‌ఎంఎస్‌లు పంపడంతో పాటు అప్లికేషన్ రిజెక్ట్ అయినవారికి కారణాలను కూడా వివరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత తుది ఎంపిక చేపట్టనున్నారు. ఇందులో భాగంగా లాటరీ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.

లాటరీ తేదీపై త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానుంది. అటు తొలి విడతలో కొంతమందికి ఇళ్లను కేటాయించారు. వీరిలో 80 శాతం మంది తమ వాటా కింద రూ.లక్ష డిపాజిట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. ఇతర ప్రాంతాల్లోని అర్హుల సంఖ్యపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం మరోసారి ఈ ప్రాంతాల్లో లాటరీ నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో కాకుండా రెండో విడత కింద పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే లబ్దిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిని విడతల వారీగా జమ చేస్తోంది. ఇక స్థలం లేనివారికి కూడా ప్రభుత్వమే స్థలం కేటాయించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *