Headlines

ఆ హీరో కోసం ఆరునెలలు తిరిగా..! కథ మొత్తం చెప్పక క్లైమాక్స్ నచ్చలేదన్నాడు : పూరిజగన్నాథ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు పూరి జగన్నాథ్ తొలి భేటీ, తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ భేటీ వెనుక పూరి పట్టుదల, కొన్ని ఆసక్తికర మలుపులు ఉన్నాయి. ఆ రోజు జరిగిన సంఘటనలను పూరి జగన్నాథ్ ఓ కార్యక్రమంలో వివరించారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే తపనతో పూరి దాదాపు ఆరు నెలల పాటు ఆయన మేనేజర్‌ను అనుసరించారు. పవన్ కళ్యాణ్‌ని నేరుగా కలవకపోయినా, మేనేజర్‌తో నిత్యం టచ్‌లో ఉండేవారు. ఒక రోజు తన స్నేహితుడు, కెమెరామెన్ శ్యామ్ కె. నాయుడు ద్వారా చోటా కె. నాయుడుని కలిశారు. చోటా, పవన్‌కు బాగా సన్నిహితుడు కావడంతో, చెత్త కథ చెప్పి తన పరువు తీయొద్దని పూరిని కోరారు. దాంతో, పవన్‌కు చెప్పాలనుకున్న “బద్రి” (ఒక హీరో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే కథ) కథను పక్కన పెట్టి, చోటాకు “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” కథను వివరించారట పూరి. ఈ కథ చోటాకు బాగా నచ్చింది. తక్షణం చోటా పవన్‌కు ఫోన్ చేసి పూరి గురించి చెప్పగా, ఉదయం నాలుగు గంటలకు కథ చెప్పడానికి రమ్మని పవన్ పిలిచారట. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎవరు కథ వింటారని పూరి ఆశ్చర్యపోగా, పవన్ ఉదయాన్నే లేస్తారని, కూర్చోమని మేనేజర్ చెప్పారట. పూరి ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి, జూబ్లీహిల్స్‌లోని పవన్ ఇంటికి చేరుకున్నారు.

పవన్ కళ్యాణ్ పూరికి అరగంట మాత్రమే సమయం ఇచ్చి, కథ చెప్పి వెళ్లిపోమన్నారట. అయితే, పూరి అది అరగంటలో చెప్పే కథ కాదని, “నేను అరగంట మాట్లాడతాను. మీకు బోర్ కొడితే తలుపు తీయండి, నేను వెళ్లిపోతాను” అని ధైర్యంగా చెప్పారట. పూరి కథ చెప్పడం మొదలుపెట్టాక, అరగంట పూర్తవగానే మేనేజర్ లోపలికి వచ్చి పవన్ వైపు చూశారు. పవన్ “వద్దులే” అన్నట్లు సైగ చేశారు. ఇలా నాలుగు గంటల పాటు కథ విన్నారు.

కథ పూర్తయ్యాక, పవన్‌కు మొత్తం కథ నచ్చిందని, అయితే క్లైమాక్స్ నచ్చలేదని, అది మార్చి వస్తే తానే దర్శకుడని చెప్పారు. పూరి బద్రి క్లైమాక్స్ (అమ్మాయితో ఎయిర్‌పోర్ట్‌లో నడవడం) కాకుండా, పవన్ స్టార్ హీరో కావడంతో యాక్షన్ ఉండేలా మార్చాలని ప్రయత్నించారు. ఒక వారం తర్వాత మళ్లీ పవన్‌ని కలిసినప్పుడు, పూరి అదే పాత క్లైమాక్స్ మరింత వివరంగా చెప్పారు. అప్పుడు పవన్ “ఇదే కదా గతంలో చెప్పింది?” అని అడిగారు. తనకు నాలుగైదు క్లైమాక్స్‌లు నచ్చలేదని, అందుకే పాతది చెప్పానని పూరి అన్నారు. అప్పుడు పవన్, “నా కోసం క్లైమాక్స్ మారుస్తావా లేదా? నీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవడానికి అలా అడిగాను” అని చెప్పి పూరిని ఆశ్చర్యపరిచారట. “నువ్వు నాకు నచ్చావు” అని చెప్పి వెంటనే త్రివిక్రమరావుకు ఫోన్ చేసి “ఈయన జగన్, మీ డైరెక్టర్” అని చెప్పడంతో పూరి జగన్నాథ్ దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభమైందని తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *